
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 22: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్స్ (సీపీజీఈటీ)- 2021 ప్రవేశాల రిజిస్ట్రేషన్లను ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి చెప్పారు. ఈ నెల 27నుంచి వెబ్ఆప్షన్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓయూ పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో 41 వేల సీట్లు ఉన్నాయని, వాటికి అదనంగా మరో నాలుగు వేల ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.