e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, ఆర్‌డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల‌ను తీవ్రంగా నిర‌సించిన కేబినెట్‌

రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, ఆర్‌డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల‌ను తీవ్రంగా నిర‌సించిన కేబినెట్‌

రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, ఆర్‌డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల‌ను తీవ్రంగా నిర‌సించిన కేబినెట్‌

హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదలశాఖ కేబినెట్‌కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని శ‌నివారం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ కేబినెట్ స‌మావేశం తీవ్రంగా ఖండించింది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి 17 సంవత్సరాలయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలయినా.. తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన నీటివాటా నిర్దారణ కాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని విజ్జప్తి చేసింది. అయితే సుప్రీం కోర్టులో కేసు కారణంగా తాము సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను విరమిస్తే గనుక తాము త్వరగా నిర్ణయిస్తామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశం (6 అక్టోబర్ 2020 నాడు) లో స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసును విరమించుకుని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తదనే నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం కేసును ఉపసంహిరించుకున్న నేపథ్యంలో కేంద్రం యొక్క నిష్క్రియాపరత్వం వల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి నూతన రాష్ట్రానికి సహకారం అందించాల్సి ఉంటుందని, అటువంటి చొరవ తీసుకోకుండా, బాధ్యత వహించకుండా నదీ జలాల విషయంలో అవలంబిస్తున్న, కేంద్ర నిర్లక్ష్య వైఖరి పట్ల కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో .. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్ అభిప్రాయ పడింది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వలన పాలమూరు, నల్ల‌గొండ‌, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైద్రాబాద్‌కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్ననేపథ్యంలో న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి ఈ క్రింది నిర్ణయాలను రాష్ట్ర మంత్రి మండలి చర్చించి నిర్ణయం తీసుకుంది.

– జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బారేజీ (జోగులాంబ) ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది
– పులిచింతల ఎడమ కాల్వను నిర్మాణం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వ‌డం
– సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరొక ఎత్తిపోథల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందివ్వ‌డం
– కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద.. భీమా వరద కాల్వను నిర్మాణం
– కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని 20 టిఎంసీలకు పెంచడం
– నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలి
– ఈ ప్రాజెక్టులకు సర్వేలు నిర్వహించి, డిపీఆర్ ల తయారీ కి వెంటనే చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖను కేబినెట్ ఆదేశించింది.
– వానాకాలం లోనే నదీ జలాల లభ్యత ఎక్కువగా ఉండడం చేత జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుకూలత ఏర్పడుతుందని కేబినెట్ చర్చించింది. అదే సందర్భంలో వానాకాలం ప్రాంరంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి, ఎప్పటి జలాలలను అప్పుడే ఎత్తిపోసుకునే వీలుంటుందని, ఈ నేపథ్యంలో తెలంగాణకు హక్కుగా వున్న జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తును వానాకాలం సీజన్ లోనే వీలయినంత సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసి ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలని, తద్వారా ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్తు ఖర్చును తగ్గించుకోగలుగుతామని కేబినెట్ అభిప్రాయపడింది.
– ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిన ప్రాజెక్టులున్నాయని, వాటి సంపూర్ణ సామర్ధ్యంతో జల విద్యుత్తును ఉత్పత్తి చేసి, రాష్ట్రంలోని కాళేశ్వరం, దేవాదుల, ఎఎం ఆర్పీ తదితర లిప్టు ఇరిగేషన్ పథకాలకు నిరంతర విద్యత్తును సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను పరిరక్షించుకొని తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది. ఈ విషయంలో ప్రధాన మంత్రిని, కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి, ఈ అక్రమ ప్రాజెక్టులను ఆపించే విధంగా చూడాలని.. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో, ఆంద్రప్రదేశ్ జల దోపిడీని ఎత్తిచూపి, రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి జాతికి వివరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరిగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, ఆర్‌డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల‌ను తీవ్రంగా నిర‌సించిన కేబినెట్‌
రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, ఆర్‌డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల‌ను తీవ్రంగా నిర‌సించిన కేబినెట్‌
రాయ‌ల‌సీమ లిఫ్ట్‌, ఆర్‌డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల‌ను తీవ్రంగా నిర‌సించిన కేబినెట్‌

ట్రెండింగ్‌

Advertisement