మంచిర్యాల, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సంఘాల్లో తప్పుడు లెక్కలు, అక్రమాల వల్ల అనేక మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం (పీఏపీఎస్)లో ముల్కల్ల గ్రామానికి చెందిన రైతు బాపుకు రూ.1,10,515 మాఫీ అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వాస్తవానికి ఆయనకు ఉన్న అప్పు రూ.9,727 మాత్రమే.. కానీ లక్షకుపైగా మాఫీ అయినట్టు మెసేజ్ రావడంతో అవాక్కయ్యాడు. పీఏసీఎస్‌కు వెళ్లి అడిగితే పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డాటా ఎంట్రీ సమయంలో పొరపాటు జరిగిందని, బాపుతో పాటు మరికొందరి రైతులకు ఇలా అయ్యిదంటూ అధికారులు తేల్చారు. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లోనూ ఈ తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో విషయం కలెక్టర్ దాకా వెళ్లింది. ప్రస్తుతం విచారణ నడుస్తున్నది. అయితే పీఏపీఎస్లలో అనుకోకుండా పొరపాట్లు జరిగాయా? లేక రైతుల పేరున కొందరు రుణాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల చనిపోయిన రైతుల పేరిట కూడా రుణాలు ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు యెల్ల రజినీకాంత్. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా(కే) తన కుటుంబసభ్యులు కుంటాల పీఏసీఎస్‌లో తీసుకున్న రుణాన్ని 2018లో వడ్డీతో కలిపి రూ.50,450 చెల్లించాడు. తర్వాత గ్రామీణ బ్యాంక్‌లో రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ రుణం మాఫీ కాలేదు. ఆరా తీయగా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.67,274 లోన్ ఉన్నదని వ్యవసాయ అధికారులు చెప్పారు. దీంతో 2018లో చెల్లించిన రసీదు తీసుకొని సొసైటీకి వెళ్లాడు. తనకు రుణమాఫీ అయితదా? కాదా? అన్న దిగాలులో ఉన్నాడు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాలకు చెందిన సంజీవ్ కుమార్ జైస్వాల్. ఈయన భార్య సంగీత పేరుపై ఉన్న 3.10 ఎకరాల వ్యవసాయ భూమికి రెబ్బెన పీఏసీఎస్‌లో రుణం తీసుకున్నారు. 2021లో రుణం చెల్లించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో రూ.లక్ష, తన పేరుపై రూ.60 వేల రుణం తీసుకున్నాడు. ఈ రుణం మూడో విడుతలో మాఫీ అవుతుందనుకున్నాడు. తీసుకున్న రుణం కట్టినప్పటికీ రూ.1.25 లక్షలు తీసుకున్నట్లే చూపిస్తున్నది. దీంతో రుణమాఫీకి అర్హత కోల్పోయాడు.