పటాన్చెరు, డిసెంబర్ 17: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పెన్నార్ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్కేవీ అభ్యర్థి రాంబాబు యాదవ్ ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ తరపున బరిలో నిలిచిన చుక్కా రాములుపై రాంబాబు 148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పరిశ్రమలో మొత్తం 584 ఓట్లకు గాను 579 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కేవీ అభ్యర్థి రాంబాబుకు 332, సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములుకు 184, ఐఎన్టీయూసీ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు 63 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను సాధించేందుకు నిరంతరం పనిచేస్తానని వెల్లడించారు.