KTR | ‘సెబీ చైర్ పర్సన్ మాధాబి పురీ బుచ్కు అదానీ గ్రూప్ తో ఉన్న సంబంధాలు బయట పడ్డాయి. ఇది చాలా షాకింగ్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థతో దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కానీ, తెలంగాణలో మీ సొంత ప్రభుత్వం గౌతం అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం ఎందుకు పలుకుతుంది రాహుల్ గాంధీ జీ’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
విదేశాల్లోని అదానీ అనుబంధ ఇన్వెస్ట్ మెంట్ సంస్థల్లో సెబీ చైర్ పర్సన్ వాటాలు కొనుగోలు చేసిన సంగతి ప్రజా వేగు దర్యాప్తులో వెల్లడయ్యాయి. గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలపై లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెబీ సమగ్రత దెబ్బ తింటుందని కూడా రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘కాంగ్రెస్ పార్టీ సమగ్రతపై తెలంగాణలో మీ సీఎం రాజీ పడుతున్నారు. గౌతం అదానీతో కలిసి చురుగ్గా భాగస్వామి అవుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలకు మీరు జవాబు ఇవ్వగలరా రాహుల్ గాంధీ గారు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ తన పోస్టులను రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు.