న్యూఢిల్లీ, జూలై 30: తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి జయభేరి మోగిస్తుందని ఇండియాటీవీ-మ్యాట్రిజ్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని స్పష్టంచేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగాలని యావత్ తెలంగాణ సమాజం ముక్తకంఠంతో కోరుకొంటున్నట్టు సర్వే తెలియజేసింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను శనివారం సాయంత్రం ‘దేశ్‌కీ ఆవాజ్’ పేరుతో ఇండియాటీవీ ప్రసారం చేసింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పట్ల 42 శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్న ట్టు ఈ సర్వే వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్కు దరిదాపుల్లో కూ డా లేవు. బీజేపీకి 28 శా తం, కాంగ్రెస్‌కు 23 శాతం మించి ఓట్లు పడే అవకాశం లేదని స్పష్టంచేసింది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరు బాగున్నదని సర్వేల్లో పాల్గొన్న 37 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకొంటారన్న ప్రశ్నకు 42 శాతం మంది సీఎం కేసీఆర్ కావాలని కోరుకొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీఆర్ఎస్కు 76కు పైగా సీట్లు రావొచ్చని సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నదని పేర్కొన్నది. పలు రాష్ర్టాల్లో ప్రస్తు తం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకొంటాయని సర్వే వివరించింది. వాస్తవానికి తెలంగాణలో ఎన్నికలు జరగడానికి మరో ఏడాదిపైగా సమయం మిగిలి ఉన్నప్పటి కీ.. దేశవ్యాప్తంగా చేస్తున్న సర్వేలన్నింటిలోనూ టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయంగా చెప్తున్నాయి.