హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం హెచ్చరించారు. శాంతియుత సహజీవనం సాగిస్తున్న ప్రజల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో మహేశ్ బిగాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టంచేందుకు బీజేపీ దండయాత్ర చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్‌తోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు, తమను ప్రశ్నించే పార్టీలు ఉండొద్దనే రీతిలో బీజేపీ వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
బీజేపీవి బ్యాక్‌డోర్ పాలిటిక్స్: అనిల్ కూర్మాచలం బీజేపీది బ్యాక్‌డోర్ పాలిటిక్స్ విధానమని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలుగా తాము ఎలా పనిచేశామో.. అదే స్ఫూర్తితో రాష్ట్ర ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలోనూ పాల్గొంటామని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబసభ్యులపై ఉసిగొల్పేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను బీజేపీ తన జేబు సంస్థలుగా వాడుకొంటున్నదని ధ్వజమెత్తారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.