టీఆర్ఎస్ అవతార్-2
భారత రాజకీయాలలో నవశకం. తెలంగాణ స్ఫూర్తితో, పరివర్తనా ప్రవక్త కేసీఆర్ నాయకత్వంలో, భారత రాష్ట్ర సమితి ప్రభవించింది. నాటి టీఆర్ఎస్ సింహ గర్జన మాదిరే, బీఆర్ఎస్ ఆవిర్భావమూ… జన్మభూమిని చెరపట్ట చూస్తున్న అపర కీచకుల పాలిట సింహ స్వప్నమైంది. మూస విధానాలు, రోత రాజకీయాలతో దేశ ప్రతిష్ఠను దిగజార్చే కుత్సిత పాలకుల గుండెలు గుభేల్మనే రీతిలో సుప్రీం లీడర్ కేసీఆర్ యుద్ధభేరి మోగించారు.
విద్వేష విష రాజకీయాలతో దేశం పతనమవుతున్న వేళ.. మోదీ పరివారం వికృత చేష్టలతో వ్యవస్థలు కుప్పకూలిపోతున్న వేళ.. విపక్షం నిర్వీర్యమై రాజకీయ శూన్యం కొనసాగితే.. అగ్నిపర్వతం బద్ధలైనట్టు అనేకానేక విస్ఫోటాలు సంభవించి దేశ మనుగడ, ప్రజాస్వామిక వ్యవస్థ భళ్ళున బద్దలైపోవచ్చు. ఈ ఉత్పాతాన్ని పసిగట్టిన కేసీఆర్ వేగంగా స్పందించిన ఫలితమే భారత రాష్ట్ర సమితి.
అట్టడుగు సమాజమంతా అట్టుడికిపోతున్న ప్రమాదకర పరిస్థితిలో.. తమ రక్షణ కోసం నేనున్నానంటూ కదిలే ధీరోదాత్తుడి కోసం దేశ జనులు ఎదురు చూస్తున్న విషమ ఘడియలో.. కేసీఆర్ బీఆర్ఎస్కు ఆయువు పోశారు. రాజకీయాలు కాదు ప్రజాకీయాలు కావాలన్న కాళోజీ ఆకాంక్షను అందిపుచ్చుకుని, ఒక అనుభవశాలి ఆధ్వర్యంలో అవతరించిన బీఆర్ఎస్.. ఝంఝానిలమై భరతఖండం నలుదిక్కులా ఉర్రూతలూపడం ఖాయమన్నది పరిశీలకుల మాట.
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అనేకమంది అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు కూడా ఉన్నరు. అనేక అవహేళనలు, ఛీత్కారాలు, శాపాలు, దీవెనలు, అనేక రకాల కామెంట్స్… అయినా అనుకున్న లక్ష్యం వైపు స్థిరంగా, బలంగా అడుగులు వేస్తూ.. పిడికెడు మంది వేలమందై, లక్షలై ఒక ఉప్పెనలా విజృంభించి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు కూడా అంతకన్న రెట్టించి హేళన చేస్తరు. అది సహజం. ఎప్పుడైనా ఒక కొత్త శక్తి ఆవిర్భావం అయితే పాత శక్తులన్నీ కలిసి దాడి చేస్తాయి. దానికి మనం సిద్ధంగా ఉండాలి.
భారత రాష్ట్ర సమితి అనే ఈ వెలుగుదివ్వెను దేశం నలుమూలలా ప్రసరింపజేసి, అద్భుతమైన బాటలు వేసి, తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరత మాత పాదాల దగ్గర పెట్టి, భరతమాత సంతృప్తిని కండ్లారా చూడా లని కోరుకుంటున్నా.
ఎడారిగా మారిపోయి, వలసలు పెరిగిపోయి, మంచినీరు కూడా దొరకని తెలంగాణ ప్రాంతమే ఎనిమిదేండ్లలో ఇంత బాగా అభివృద్ధి చెందగలిగితే.. భారతదేశం రత్నగర్భ, అద్భుతమైన, అపారమైన మానవ సంపద. ప్రపంచంలోనే ఏ దేశానికి లేని అనుకూలతలు ఉన్న దేశం ఇంకెంత అభివృద్ధి చెందాలి!
ఇంత సుసంపన్నమైన పంటలు పండే భూములు ఉండి, 75 వేల టీఎంసీల నీళ్లు ఉండి, పనిచేయగలిగే 130 కోట్ల జనం ఉండి, ఎందుకు ఆకలి బాధలు పడాలె. రైతులు నెలలపాటు ఎందుకు ధర్నాలు చేయాలె. ఈ దుస్థితి ఇంకా ఎంత కాలం?
ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్న అత్యంత విలువైన వనరు మానవ వనరులు. భారత దేశంలో 52 శాతం యువశక్తి ఉన్నది. వాళ్లను నిర్వీర్యం చేస్తున్నరు. మతోన్మాదం పేరుతో రెచ్చగొడుతున్నరు. మనం గుడ్లప్పగించి చూస్తున్నాం. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే భయంకరమైన పరిణామాలు వస్తాయి.
తెలంగాణలో మార్పును చూసినట్టే.. దేశంలోనూ పరివర్తన చూడబోతున్నాం. ఉత్తమమైన గుణాత్మకమార్పు కోసం, ఉన్నత స్థాయికి చేరుకునే ఆర్థిక పరిపుష్టి కోసం నడుంబిగిద్దాం. రాష్ట్ర హక్కులు, దేశ హక్కులు అని కాకుండా దేశం మొత్తం ఏకోన్ముఖంగా అద్భుతమైన పరిపుష్టం చెందేలా బాటలు పడాలి.
నాటి నుంచి నేటి వరకు రాజకీయాలు అంటే ఒక పార్టీ గెలవడం, ఒకటి ఓడిపోవడం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నది సాకారం కావాలంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. ప్రజల ప్రతినిధులు గెలవాలె, వారు ప్రజల కోసం పనిచేయాలె, అంటే.. ఎన్నికల ద్వారా ప్రజలు గెలవాలె, ప్రజల అభిప్రాయం పెరగాలె, ప్రజాస్వామ్యం పరిపుష్టం చెందాలె. ఆ పరివర్తన కోసం ఈ రోజు ఉద్భవించిందే బీఆర్ఎస్. ఈ దేశాన్ని మంచి మార్గం పట్టించడానికి, నూతన ఆలోచనతో నూతన ఒరవడి సృష్టించడానికే బీఆర్ఎస్.
వాటర్ పాలసీ
ట్రిబ్యునళ్లు వేసి, దశాబ్దాలపాటు రాష్ర్టాల మధ్య కొట్లాటలు పెట్టి తమాషాలు చూసే కేంద్ర ప్రభుత్వాల దుర్మార్గం, దౌర్భాగ్యం, దాష్టీకం పోయేందుకు కొత్త వాటర్ పాలసీ తీసుకొస్త్తం.
అందుకోసమే బీఆర్ఎస్.
ఫైనాన్స్ పాలసీ
ఆర్థికంగా అనేక రంగాల్లో పురోగమించి, ఉచ్ఛస్థాయికి చేరుకునేందుకు, ఆర్థిక రంగం కళకళలాడేందుకు, విదేశీ నిల్వలు పుంజుకునేందుకు, రూపాయి బలోపేతానికి ‘కొత్త ఎకనామిక్ పాలసీ’ తీసుకొస్తం.
అందుకోసమే బీఆర్ఎస్.
పవర్ పాలసీ
దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. అపారమైన నీటి సంపదను, బొగ్గును, సౌరశక్తిని వాడుకొని సరిపడా కరెంటును ఉత్పత్తి చేసేలా కొత్త పవర్ పాలసీ తీసుకొస్త్తం.
అందుకోసమే బీఆర్ఎస్.
అగ్రి పాలసీ
దేశంలోని రైతులు నెలలపాటు ధర్నాలు చేసే దుస్థితిపోయి, తెలంగాణలోలాగా రైతాంగం అభివృద్ధి చెందేలా ‘కొత్త అగ్రికల్చర్ పాలసీ’ తీసుకొస్తం.
అందుకోసమే బీఆర్ఎస్.
గ్రీన్ పాలసీ
తెలంగాణకు హరితహారం పేరిట రాష్ట్రంలో తెచ్చిన గొప్ప హరిత విప్లవం దేశమంతటా తెచ్చేందుకు న్యూ ఎన్వైరాన్మెంటల్ పాలసీ తీసుకొస్తం.
అందుకోసమే బీఆర్ఎస్.
బడుగుల పాలసీ
దశాబ్దాలుగా నలిగిపోతున్న దళితులు, గిరిజనులు, బీసీలు, ఓసీల్లో నిరుపేదలను ఆదుకునేందుకు తెలంగాణ దళితబంధు తరహాలో ‘వీకర్స్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీ’ తీసుకొస్తం.
అందుకోసమే బీఆర్ఎస్.
ఉమెన్ పాలసీ
తెలంగాణ రిజర్వేషన్ ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తే మహిళలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అలాగే దేశంలోని మహిళల కోసం ‘న్యూ ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ’ తీసుకొస్తం.
అందుకోసమే బీఆర్ఎస్.