హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తున్నారు. వరుసగా నాలుగో రోజు కూడా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై కదం తొక్కారు. వీరికి ఇతర విపక్ష ఎంపీలూ గొంతు కలిపారు.
లోక్‌సభలో రగడ
గురువారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌నేత, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోత్ కవిత, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ కేంద్రం తీరుపై నిరసన మొదలుపెట్టారు. చమురు, వంట గ్యాస్ తదితర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలకు డీఎంకే, ఎస్పీ, టీఎంసీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ సభ్యులు జత కలిసి స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్షాల డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించటంతో సభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్ చేసింది. మిగితా పక్షాలు టీఆర్ఎస్ను అనుసరించాయి.
ధరల పెరుగుదలపై చర్చకు టీఆర్ఎస్ పట్టు
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు గురువారం 176 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. రాజ్యసభ సమావేశం కాగానే చర్చకు కేశవరావు పట్టుబట్టారు. ఈ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్ చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లగా వారికి ఇతర పార్టీల సభ్యులు జత కలిశారు. నిరసనల హోరు పెరగడంతో స్వల్పకాలంపాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు చర్చకు పట్టుబట్టడంతో సభ మరోసారి వాయిదా పడింది. తమ డిమాండ్లపై చర్చించడానికి చైర్మన్ నిరాకరించడంతో టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ అనంతరం విపక్ష పార్టీల సభ్యులతో టీఆర్ఎస్ రాజ్యసభ, లోక్‌సభాపక్ష నేతలు ఇతర విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, కనిమొళి, వైగో తదితరులతో సమావేశమయ్యారు.