సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:35

ఇక పోరాటమే

ఇక పోరాటమే

 • రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ ప్రసక్తే లేదు
 • కలిసి వచ్చే పార్టీలతో కేంద్రాన్ని నిలదీయాలి
 • ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం
 • ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తాం
 • లేఖలు, వినతులతో స్పందించడం లేదు
 • ఇన్నేండ్లు ఓపిక పట్టాం.. ఇక సహించబోం
 • మాటలతో కాలం వెళ్లదీస్తూ మభ్యపెడుతున్నారు
 • కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేకే నిప్పులు
 • ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం
 • లేఖలు, వినతులతో స్పందించడం లేదు
 • ఓపిక పట్టాం.. ఇక సహించం: కేకే నిప్పులు
 • ఏడేండ్లుగా తెలంగాణకు అన్యాయం:నామా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. పార్లమెంట్‌ లోపల, బయట నిరసన వ్యక్తంచేయాలని, కలిసి వచ్చే పార్టీలతో కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది. ఏడు సంవత్సరాలుగా అనేక వినతిపత్రాలు, లేఖలు ఇచ్చినా కనీస స్పందనలేదని, ఇకపై కేంద్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు అన్నారు. రాజ్యంగం ప్రకారం రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన నిధులు, హక్కులను సాధించుకుంటామన్నారు. 

టీఆర్‌ఎస్‌ ఎంపీలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై ప్రస్తావించాల్సిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులు, అనుమతులపై సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడొద్దని, కేంద్రంపై తీవ్రస్థాయిలో పోరాటం చేయాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు సూచించారు. సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

రాష్ర్టానికి రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించామని కేశవరావు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు ఇవ్వాలని, వివాదాలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్‌ అనేక ఉత్తరాలు రాశారని, స్వయంగా ప్రధానిని కలిసి వినతిపత్రాలు అందించారని, అయినా కనీసస్థాయిలో కూడా స్పందన రాలేదని చెప్పారు.  సీఎం కేసీఆర్‌ కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టామన్నారు. ఇకపై సహించేదిలేదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని పూర్తిచేయడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. దీంతో యూరియా అవసరం కూడా పెరిగిందన్నారు. రాష్ర్టానికి 10.5 మిలియన్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా 8.7మిలియన్‌ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.


జీఎస్టీ బకాయిలు రూ.9వేల కోట్లు

జీఎస్టీ అమల్లోకి రాకముందు వ్యాట్‌ ప్రకారం రాష్ట్రంలో 24శాతం వృద్ధి నమోదు అయిందని కేశవరావు తెలిపారు. వన్‌ నేషన్‌, వన్‌ ట్యాక్స్‌ విధానం కోసం జీఎస్టీకి మద్దతు తెలిపామన్నారు. 14 శాతం తక్కువ ఆదాయం వస్తే నష్టపరిహారం ఇస్తామని చట్టంలోనే ఉన్నదని, దీనిప్రకారం తెలంగాణకు జీఎస్టీ కింద రూ. 5,764కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.2,641కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.450కోట్లు రావాల్సి ఉందన్నారు. అన్నీ కలిపితే రూ.8,855కోట్లు కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులోని ప్రతి సెక్షన్‌ ప్రజా వ్యతిరేకంగా ఉందన్నారు. 

ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించామని, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోరాడుతామని చెప్పారు. రాష్ర్టానికి జాతీయ రహదారులను 3,155 కిలోమీటర్లు మంజూరు చేశారని, కానీ ఇప్పటివరకు 1,388 కిలోమీటర్ల నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఇచ్చారని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని చట్టంలోనే ఉన్నదని, దీనిపై అనేకమార్లు సీఎం కేసీఆర్‌ లేఖలు రాశారని, పార్లమెంట్‌లో కూడా మాట్లాడామని గుర్తుచేశారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా వరంగల్‌లో ఏర్పాటుచేసిన మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులు ఇవ్వాలని అనేకమార్లు విన్నవించినా.. కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదని మాటలతో మభ్య పెడుతున్నా రని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ఆరు ఎయిర్‌స్ట్రిప్‌లను ఏర్పాటుచేస్తాం. మేమే భూమి సేకరించుకుంటాం. మా డబ్బులతో మేమే నిర్మించుకుంటాం.. అనుమతి ఇవ్వమంటే కూడా అనుమతి ఇవ్వడంలేదు’ అని కేకే ధ్వజమెత్తారు.

ఇతర పార్టీలు కలిసి రావాలి: నామాతెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో పోరాడాలని నిర్ణయించామని, దీనిపై రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు కలిసి రావాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారో.. లేక వ్యతిరేకంగా ఉం టారో తేల్చుకోవాలని  సవాలుచేశారు.  ఏడేం డ్లుగా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నదన్నారు.  బీజేపీకి రైతులు తగిన బుద్ధిచెపుతారన్నారు. జాతీయ రహదారులు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు చేపడుతున్నారని, కానీ పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు సంతోష్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బండ ప్రకాశ్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, పీ రాములు, రంజిత్‌రెడ్డి, బీ వెంకటేశ్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోతు కవిత, పీ దయాకర్‌ పాల్గొన్నారు. 


logo