హైదరాబాద్ : ప్రముఖ ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. గోరటి రచించిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి ఈ అవార్డు వచ్చింది. అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఇవాళ 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించింది.
అవార్డు ఎంపికకు సంబంధించిన తెలుగు జ్యూరీ సభ్యుల్లో.. డాక్టర్ సీ మృణాళిని, జీ శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాయని విద్మహే ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు తెలుగు భాష నుంచి మొత్తం 13 మంది రచయితలు, కవులు పోటీ పడగా, అందులో గోరటి వెంకన్నను అవార్డు వరించింది.
తెలుగు భాషకు సంబంధించి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2021 అవార్డు తగుళ్ల గోపాల్‌కు దక్కింది. గోపాల్ రచించిన ‘దండకడియం’ కవితాసంపుటికి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు వచ్చింది. దేవరాజు మహారాజుకు బాలసాహిత్య పురస్కారం వరించింది. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి గానూ ఈ అవార్డు వచ్చింది.