హైదరాబాద్ : దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా సీఎం కేసీఆర్ నిలిచారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ మాటలను ఆచరణలో పెట్టిన సీఎం కేసీఆర్ను తెలంగాణ గాంధీ అంటున్నారు. మన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి అని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు.
పుట్టిన బిడ్డ నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ల వరకు సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద నగదు సాయాన్ని అందజేస్తున్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ లు ఇస్తున్నామని తెలిపారు. వందకు పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ ఈ పథకాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు.