హైదరాబాద్ : నమో అంటే నమ్మక ద్రోహం.. మోసంలా ప్రధాని నరేంద్ర మోదీ మారాడని, పార్లమెంట్ సాక్షిగా ఆయన తత్వం బయటపడిందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ బంధువైతే, మోదీ రాబంధువలా తయారయ్యాడని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్‌నే, సంతకం పెట్టిన రాష్ట్రపతిని మోదీ అవమానించారని ఆరోపించారు. మోదీ రాజ్యాంగ, తెలంగాణ ద్రోహి అని.. తక్షణమే మోదీ దేశానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చివరకు తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్‌ను సైతం మోదీ అవమానించారన్నారు. తెలంగాణ వచ్చి ఏడున్నర సంవత్సరాలు అయ్యిందని, అయినా తెలంగాణకు సాడే సాత్లా.. తెలంగాణకు శనిలా మారాడాన్నారు. మోదీ వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ చచ్చిపోవడం ఖాయమన్న జీవన్‌రెడ్డి.. చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయన్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని చూసి ఓర్వలేకనే మోదీ.. లేని వివాదాన్ని రేపాడని
ఆరోపించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, తెలంగాణ అభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు తాము అడుగుతుంటే.. మోదీ ఆడరాక పాత గజ్జెలు అన్నట్లు తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం హామీలు తుంగలో తొక్కి.. తెలంగాణ వ్యతిరేకి అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడని, మోదీ తీరు చూస్తుంటే తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్రకు తెర లేపాడా? అనుమానం కలుగుతోందన్నారు.
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చరిత్ర బీజేపీ నేతలదని, తెలంగాణ ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త .. బీజేపీని నమ్మితే తెలంగాణను ఏపీలో కలిప్తేసారన్నారు. టీఆర్ఎస్ ఉన్నంత వరకు తెలంగాణను బీజేపీకి బానిస కానివ్వమని, మోదీ అక్కసుకు తెలంగాణ బీజేపీ నేతలు వత్తాసు పలికితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. 4కోట్ల మంది ప్రజలను అవమానించిన మోదీ గద్దె దిగే వరకు పోరాడుతామని, బీజేపీలో 1999లో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత మంది విద్యార్థులు, యువకులు బలిదానం చేసుకునే వారు కాదన్నారు.
తెలంగాణ కోసం అమరులైన వారిని మోదీ అవమానించారని, తెలంగాణపై విషం చిమ్మిన మోదీ
రాష్ట్రంలోకి వస్తే నిలదీసే పరిస్థితి ఉందని, ప్రధాని పదవికే కళంకం తెచ్చారని విమర్శించారు. తెలంగాణపై ఇంత నీచంగా మాట్లాడిన ప్రధాని ఎవరూ లేరని, ఇక తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ శూన్యమేనన్నారు. తెలంగాణ వ్యతిరేక డీఎన్ఏ తనలో ఉందని ప్రధాని నిరూపించుకున్నారని, బీజేపీ నేతలు తెలంగాణలో ఇక ఏం మొహం పెట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు.