హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదుల కర్మాగారంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ఉగ్రవాద స్వభావం ఉన్న కొంతమంది బీజేపీ ఎంపీలు.. రైతులను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్.. ఆ తర్వాత మాట నిలబెట్టుకోనందుకే ఆయనను రైతులు నిలదీస్తున్నారని తెలిపారు. ఒక్క ఆర్మూర్‌లోనే కాదు.. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరవింద్‌ను రైతులు నిలదీశారు అని చెప్పారు.
బండి సంజయ్ వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. రైతులను ఉగ్రవాదులతో పోల్చితే బండి సంజయ్ ఎక్కడా తిరగలేడు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. సంజయ్ కిరాయి మూకలతో ఆర్మూర్‌కు వెళ్లారు. ఆయన వెంట ఎవరూ రైతులు లేరు అని స్పష్టం చేశారు. బండి సంజయ్‌కు దమ్ము ఉంటే పసుపు బోర్డు తీసుకొచ్చి మాట్లాడాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీని తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి కాబట్టే.. ఆయన వెంట తెలంగాణ సమాజం ఉందని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. తమది కేసీఆర్ ఇజం అయితే బీజేపీది రౌడీయిజం అని ఆయన పేర్కొన్నారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న బీజేపీ నాయకులపై చట్టప్రకారం కేసులు పెడుతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.