నల్లగొండ : కోవిడ్ నిబంధనలకు లోబడి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులకు సూచించారు. చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి జిల్లా స్థాయి అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. మంచినీరు, మూత్రశాలలు పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వైద్యాధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు, శాంతి భద్రతలకు భంగంవాటిల్లకుండా పోలీసు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. బాధ్యతారాహిత్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే లింగయ్య హెచ్చరించారు.