హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్: హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలను ఈసీకి సమర్పించింది. కమలాపూర్ మండలం భీంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన కారు, ఆటో ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. అయితే ఈ ఘటనకు స్టార్ కాంపెయినర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు సంబంధం లేకపోయిన బీజేపీ నేత ఈటల రాజేందర్ అసత్య, తీవ్ర నేరారోపణలు చేశారు. అనుమతి లేకుండా రోడ్డుపై 5 గంటలపాటు రాస్తారోకో చేసినట్టు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్ఎస్వీ క్రియాశీల కార్యకర్త నాంపల్లి జగన్‌పై బీజేపీ నాయకులు నాంపల్లి సుమన్, అంగిరేకు రాజు, నిమ్మల సంజీవ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పంచుతున్నదని ప్రచారం చేయడంతోపాటు డబ్బులు తీసుకోవాలని చెప్తూ ఓటర్లను తప్పుదోవ పట్టించారు. ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని ఓటు బీజేపీకి వేయండి అని సూచించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ విజ్ఞప్తిచేశారు.