హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, భరత్ కలిసి తెలంగాణ ఎస్ఈసీ శశాంక్ గోయల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను జగ్గారెడ్డి ప్రలోభ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డిసెంబర్ 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నజరానా ఇస్తామని జగ్గారెడ్డి ఓటర్లకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటుకు ముందు రూ. 50 వేలు, ఓటు వేసిన తర్వాత రూ. 2 లక్షలు ఇస్తామని వివిధ పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ పెయిడ్ న్యూస్ రాయిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు తెలిపారు.