హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జల దృశ్యంలో చిన్న ధారగా మొదలై.. తెలంగాణలోని సబ్బండ వర్ణాలను తనలో కలుపుకొని ఉద్యమ ప్రళయమై ఢిల్లీని సునామీలా ముంచెత్తింది. దశాబ్దాల కలను సాకారం చేసి తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించింది. సాధించుకొన్న రాష్ర్టాన్ని సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ పేరే ఒక ఉద్యమం.. ఈ పేరే ఒక ప్రేరణ.. ప్రజాస్వామ్య ఉద్యమాలకు నిఘంటువు.. 20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానమే ఒక చరిత్ర.
పుట్టుక నుంచీ వైవిధ్యమే
తెలంగాణ రాష్ట్ర సాధనకోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్. పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు ప్రతి మలుపూ వైవిధ్యమే. ఉద్యమ పార్టీగా మొదలైనప్పటి నుంచి పకా పొలిటికల్ పార్టీగా మారేవరకు ఏం చేసినా ప్రత్యేకమే. లక్ష్య సాధనలో విజయ తీరాలను చేరి, స్వరాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించుకొని, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటానికి అడుగులు వేస్తున్నది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిడికెడు మంది నాయకులతో కలిసి టీఆర్ఎస్ను స్థాపించారు. జలదృశ్యంలోని కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడుపోసుకున్న టీఆర్ఎస్, 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభతో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. 2006లో హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ప్రారంభం తర్వాత టీఆర్ఎస్ జోరు పెంచింది.
స్థాపించిన నెలలోపే ఆరు సభలు
పార్టీ స్థాపించిన ఒక నెలలోనే తెలంగాణ ప్రాంతంలో ఆరు భారీ బహిరంగసభలను నిర్వహించి కేసీఆర్ సంచలనం సృష్టించారు. ప్రతి సభకూ జనం పోటెత్తటంతో ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదో అందరికీ అర్థమైంది. 2001 జులైలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆగస్టులో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో తన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో కేసీఆర్ భారీ మెజారిటీతో విజయం సాధించి తెలంగాణ మొత్తం తన వెంటే ఉన్నదని నిరూపించారు. 2003 మార్చిలో ఢిల్లీకి నిర్వహించిన కార్ల ర్యాలీ దేశం మొత్తాన్ని ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమం గెలుపు తీరాలకు చేరాలంటే ఢిల్లీలో లాబీయింగ్ తప్పనిసరి అని గుర్తించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన పొత్తు ప్రతిపాదనకు అంగీకరించారు. కేసీఆర్ షరతు మేరకు కామన్ మినిమం ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగం, ప్రధానమంత్రి ప్రసంగాల్లో తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటనలు వచ్చా యి.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తాత్సారం చేయడంతో 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణకు అనుకూలంగా ఆ పార్టీతో కేంద్రానికి లేఖ ఇప్పించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ మొదలుపెట్టిన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి. దాంతో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. సమైక్యవాదుల లాబీయింగ్‌తో మళ్లా 14 రోజులకే ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవటంతో, కేసీఆర్ తెలంగాణ జేఏసీని ఏర్పాటుచేసి సబ్బండవర్ణాల మద్దతుతో ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేశారు. జేఏసీకి వెన్నెముకగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 2018లో రెండోసారి ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ స్థాపనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.