హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో దసరా రోజు (అక్టోబర్5, బుధవారం) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్‌బాడీ మీటింగ్ యథావిధిగా జరుగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం సర్వసభ్య సమావేశంపైన ఉండదని, సభ్యులు అనుమానాలకు గురికావద్దని తెలిపారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 5 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేశిత సమయంలోపే హాజరుకావాలని పేర్కొన్నారు.