అట్లాంటా స్టేడియంలో వరల్డ్‌కప్ ప్రిక్వార్టర్ ఫైనల్. ఇటు ప్రపంచ చాంపియన్ లియోనల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా.. అటు వైపు అనామక ఈజిప్ట్. 78వ నిమిషాల ఆటైంది. స్కోరు చూస్తే 2-0తో ముందంజలో ఈజిప్ట్. వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ప్రిక్వార్టర్స్ఆడుతున్న ఈజిప్ట్ నుంచి ఇలాంటి పోరాటాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. బ్రెజిల్, పోర్చుగల్ బాటలో అర్జెంటీనా కూడా ఇంటిదారి పడుతుందా? ఈ ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం తప్పదా? అనుకుంటున్న టైమ్‌లో మెస్సీసేన అద్భుతం చేసింది. అప్పటిదాకా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయిన డిఫెండింగ్ చాంపియన్లు చివరి 15 నిమిషాల్లో పూనకాలు వచ్చినట్టు రెచ్చిపోయారు. ధడేల్.. ధడేల్ మంటూ మూడు గోల్స్ కొట్టి తమ జట్టును ముందుకు తీసుకెళ్లారు.
అట్లాంటా: ప్రపంచ చాంపియన్ ఆట ఎలా ఉంటుందో అర్జెంటీనా నిరూపించింది. అసాధారణ పోరాట పటిమతో ఓటమి అంచుల్లోంచి పుంజుకొని క్వార్టర్‌ఫైనల్ చేరుకుంది. మంగళవారం రాత్రి అత్యంత ఉత్కంఠగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీసేన 3-2తో ఈజిప్ట్‌ను ఓడించి ఊపిరిపీల్చుకుంది. 15వ నిమిషంలో యాసిర్ ఇబ్రహీం, 67వ నిమిషంలో మోస్తఫా జికో చెరో గోల్ కొట్టి ఈజిప్ట్‌ను ఆధిక్యంలో నిలిపారు. చివర్లో గొప్పగా పుంజుకున్న డిఫెండింగ్ చాంపియన్.. క్రిస్టియానో రోమెరో (79వ ని), మెస్సీ (83వ ని), ఎంజో ఫెర్నాండెజ్ (90+3వ ని) కొట్టిన గోల్స్‌తో గట్టెక్కింది. ఈ వరల్డ్‌కప్‌లో ఎనిమిదో గోల్ కొట్టిన మెస్సీ మరో ట్రోఫీతో పాటు గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన ఈజిప్ట్.. 15వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. అటియా అందించిన క్రాస్‌ను ఇబ్రహీం హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. 21వ నిమిషంలో పెనాల్టీ రూపంలో సువర్ణావకాశం లభించినా మెస్సీ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తన షాట్‌ను ఈజిప్ట్ గోల్‌కీపర్ షోబీర్ అద్భుతంగా డైవ్ చేస్తూ అడ్డుకున్నాడు. ఈ టోర్నీలో మెస్సీ పెనాల్టీ మిస్ చేయడం రెండోసారి. మ్యాచ్ 32వ నిమిషంలో మెస్సీ కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్‌కు తగిలి వెనక్కి రాగా, 40వ నిమిషంలో అల్వారెజ్ కొట్టిన లో షాట్‌ను కూడా గోల్‌కీపర్ షోబీర్ అద్భుతంగా సేవ్ చేయడంతో తొలి సగంలో అర్జెంటీనాకు నిరాశే మిగిలింది. విరామం తర్వాత మెస్సీసేన పూర్తిగా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసింది. బంతిని తమ కంట్రోల్‌కి తీసుకొని ప్రత్యర్థి డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లింది.
కానీ, ఈజిప్ట్ అస్సలు వెనక్కుతగ్గలేదు. ఆ జట్టు డిఫెండర్లంతా గోడ కట్టినట్టు నిలబడి ప్రత్యర్థి ప్రయత్నాలు నిలువరించారు. అదే టైమ్‌లో బంతిని తమ కంట్రోల్‌కి రావడమే ఆలస్యం అన్నట్టు ఈజిప్ట్ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఈ క్రమంలో మ్యాచ్ 60వ నిమిషంలో మోస్తఫా జికో గోల్ కొట్టాడు. కానీ, గోల్‌కు ముందే అర్జెంటీనా ప్లేయర్ మార్టినేజ్పై హైసెమ్ హసన్ ఫౌల్ చేయడంతో రిఫరీ గోల్‌ను తిరస్కరించడంతో అర్జెంటీనా ఊపిరిపీల్చుకుంది. అయినా ఈజిప్ట్ ఎదురుదాడులు ఆపలేదు. మహమ్మద్ సలాహ్ అందించిన అద్భుత పాస్‌ను హసన్ డిఫెండర్లను దాటుకుంటూ బాక్స్‌లోకి తీసుకెళ్లి కట్ చేయగా, జికోనే దాన్ని నెట్ లోకి పంపి ఈజిప్ట్‌కు 2-0తో ఆధిక్యాన్ని అందించడంతో మెస్సీతో పాటు అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానుల ముఖాల్లో నిరాశ కనిపించింది.
మ్యాచ్‌లో ముప్పావు వంతు ఈజిప్ట్ ఆధిపత్యం నడవగా.. ఆఖర్లో అర్జెంటీనా తమలోని చాంపియన్‌ను నిద్రలేపింది. సెకండాఫ్ హైడ్రేషన్ బ్రేక్ తర్వాత ఆ జట్టు ఆట పూర్తిగా మారింది. తీవ్ర ఒత్తిడిలో తమలోని నైపుణ్యాలను చూపించింది. కెప్టెన్ మెస్సీ తనదైన శైలిలో బంతిని బాక్స్‌లోకి తీసుకొచ్చి ఇచ్చిన క్రాస్‌ను రోమెరో హెడర్‌తో నెట్లోకి పంపడంతో అర్జెంటీనా ప్రాణం లేచొచ్చినట్టు అయింది. నాలుగు నిమిషాల తర్వాత మరోసారి బంతిని నెట్ దగ్గరికి క్రాస్ చేసిన మెస్సీ అంతే వేగంగా బాక్స్‌లోకి దూసుకొచ్చాడు. మోంటినెల్ ఇచ్చిన పాస్‌ను అతను ఒడుపుగా గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమం అయింది. 7 నిమిషాల ఇంజూరీ టైమ్ మొదలైన వెంటనే ఈజిప్ట్ మళ్లీ కౌంటర్ ఎటాక్ చేసినా.. అర్జెంటీనా ప్లేయర్లు బంతిని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రత్యర్థి డిఫెన్స్ ఏరియాలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో మార్టినెజ్ అందించిన క్రాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ తలతో గోల్ కొట్టడంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది. ఫైనల్ విజిల్ ముగిసిన వెంటనే విజయానందంలో మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.