హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 27న ఉదయం 10 గంటలకు పార్టీ ప్రతినిధులంతా సమావేశ మందిరానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల పేర్లు నమోదు చేస్తారు. ఉదయం 11:05 గంటలకు కేసీఆర్ సమావేశ మందిరానికి హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి స్వాగతోపన్యాసం చేస్తారు. సమావేశంలో దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టి, వాటిపై చర్చ అనంతరం ఆమోదిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగనున్నది.
హాజరయ్యే ప్రతినిధులు వీరే..: రాష్ట్ర మంత్రివర్గం, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఎంపీపీ అధ్యక్షులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్లు సమావేశంలో పాల్గొంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.