వరంగల్, నవంబరు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులను టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టబోదని, అన్నదాతల అంగీకారంతోనే విజయగర్జన సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. సభ కోసం 130 ఎకరాలు ఇస్తున్నట్టు ఇప్పటికే రైతులు స్వయంగా అంగీకార పత్రాలు ఇచ్చారని పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని, అన్నదాతల కోసం అత్యధిక పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏండ్లయిన సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విజయగర్జన సభకు వివిధ ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించామని, రైతుల అంగీకారంతోనే హసన్పర్తి మండలం దేవన్నపేటలో సభకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం, అభ్యున్నతి విషయంలో టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని… బహిరంగసభ కోసం వినియోగించుకునే రైతులకు పంటల పరంగా ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వయంగా రైతుబిడ్డ అయిన సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం జరగనివ్వరని అన్నారు. టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహణ కోసం తాత్కాలికంగా భూములు ఇస్తున్న రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.