
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ‘ఏమి లేనోడికి ఏతులెక్కువ.. గిద్దెడు బియ్యానికి పొంగులెక్కువ’.. రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు అచ్చం ఇలాగే ఉన్నది. ఒకటిరెండు ఎన్నికల్లో చచ్చీచెడీ సాధించిన విజయాలకే జబ్బలు చరుచుకొని, ఇక మాకు తిరుగులేదన్నట్టు ఎగిరెగిరి పడ్డాయి. తమకుతాము అతిగా ఊహించుకొని చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. మరోపక్క ఏకంగా 18 ఎమ్మెల్సీ స్థానాలు అవలీలగా గెలుచుకొన్న టీఆర్ఎస్ ఎలాంటి హంగూ ఆర్భాటాలు ప్రదర్శించలేదు. గెలిస్తే విర్రవీగడం, ఓడితే కుంగిపోవడం టీఆర్ఎస్ చరిత్రలోనే లేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి
రాజకీయాలు, ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజమని, ఓడినంత మాత్రాన బాధ్యత నుంచి తప్పుకుంటామా? గెలిచినంత మాత్రాన ఎగిరిదుంకి ఇగ మా అంత సిపాయి లేడని విర్రవీగుతామా అని సీఎం కేసీఆర్ తరుచూ చెప్తుంటారు. ఇటీవల అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ, ప్రజాప్రతినిధుల సమావేశాల్లోనూ ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని, గెలుపును ఎంతో బాధ్యతగా స్వీకరించి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని చెప్తుంటారు. ఏడేండ్ల అధికారంలో సీఎం కేసీఆర్ విధానపరమైన అంశాలపై విపక్షాల అవగాహనారాహిత్యాన్ని పటాపంచలు చేశారే తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ నిందించలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. గత ఏడేండ్లలో ఏ ఎన్నిక జరిగినా విజయం సాధిస్తూ వస్తున్న టీఆర్ఎస్ నేతల్లో మరింత ఒదిగే తత్త్వం కనిపిస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఏమీ లేకున్నా ఎగిరెగిరి పడుతున్నారని పేర్కొంటున్నారు. ఒకటిరెండు ఎన్నికల్లో గెలవగానే ఆ పార్టీల నేతల ప్రసంగాల్లో అహంకారం, దుర్భాషలు స్పష్టంగా కనపడుతున్నాయని గుర్తుచేస్తున్నారు. టీఆర్ఎస్లో ఇందుకు భిన్నమైన వాతావరణం కనపడుతున్నదని చెప్తున్నారు. నిన్నమొన్నటివరకూ వచ్చే ఎన్నికల తర్వాత అధికారం తమదేనని విర్రవీగిన బీజేపీ, కాంగ్రెస్ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టినట్టు ఫలితాలు రావటంలో సైలెంట్ అయిపోయాయి.