మొదటిసారి విమానం ఎక్కడమంటే.. చాలామంది ఉద్వేగంగా ఫీలవుతారు. అదే సమయంలో కాస్త ఆందోళన, గందరగోళానికీ గురవుతారు. ముఖ్యంగా, తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లతో విమానాశ్రయాల్లో లేనిపోని ఇబ్బందులు పడతారు. విమానయానం సాఫీగా సాగాలంటే.. కొన్ని సలహాలు పాటించాలని అంటున్నారు.
ఎయిర్పోర్ట్ తనిఖీలు చాలా కఠినంగా ఉంటాయి. ఏయే వస్తువులు వెంట తీసుకెళ్లడానికి అనుమతి ఉండదో ముందే తెలుసుకోవాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. కొబ్బరికాయలు (ఎండు కొబ్బరి), కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులు, లైటర్లు, అగ్గిపెట్టెల్ని కూడా తీసుకెళ్లనివ్వరు. ఇక ద్రవ పదార్థాలను తీసుకెళ్లడానికీ అనేక నిబంధనలు ఉంటాయి. హ్యాండ్ బ్యాగుల్లో 100 ఎంఎల్ కంటే ఎక్కువ పరిమాణం ఉన్న ద్రవపదార్థాలకు అనుమతి ఉండదు. నూనె, పర్ఫ్యూమ్, షాంపూలైనా.. తీసుకెళ్లడానికి వీల్లేదు. ఇక పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలు, ల్యాప్టాప్లను చెక్ ఇన్ బ్యాగేజీలో వేయకూడదు. వాటిని మీతోపాటు విమానం లోపలికి తీసుకెళ్లే బ్యాగులోనే ఉంచాలి.
ఇక్కడ బ్యాగు బరువు కూడా కీలకమే! డొమెస్టిక్ ప్రయాణాల్లో చెక్ ఇన్ బ్యాగేజీ 15 కిలోలు, హ్యాండ్ బ్యాగేజీకి 7 కిలోలు పరిమితి ఉంటుంది. ఈ పరిమితి దాటితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, బ్యాగుల బరువును ఇంటి దగ్గరే సరిచూసుకోవాలి. ఇక విమానం ప్రయాణంలో సమయ పాలన అత్యంత కీలకం. ఫ్లయిట్ బయల్దేరడాని కన్నా చాలా ముందుగానే బోర్డింగ్ ప్రక్రియ ముగుస్తుంది. టేకాఫ్ అవ్వడానికి 25 నుంచి 45 నిమిషాల ముందే బోర్డింగ్ గేట్లు మూసివేస్తారు. ఆ సమయానికి ఎయిర్పోర్ట్ లోపల ఉన్నప్పటికీ.. గేట్ దగ్గరికి చేరుకోకపోతే విమానం ఎక్కనివ్వరు. కాబట్టి, సమయానికి కాస్త ముందే బయల్దేరడం మంచిది. ప్రయాణ టికెట్లు, బోర్డింగ్ పాస్లతోపాటు ఒరిజినల్ ఐడీ కార్డులను కూడా వెంట ఉంచుకోవాలి. ఇలా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, విమాన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.