హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ- పీఏసీ)తో ఒప్పందం చేసుకొన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ ఒప్పందం ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐప్యాక్‌తో మాత్రమేనని, ప్రశాంత్ కిషోర్‌తో కాదని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని ఆదివారం ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం ఐప్యాక్ పనిచేస్తుందని వివరించారు.
సీఎం కేసీఆర్ రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ను విజయవంతంగా నడిపిస్తున్నారని, అయితే డిజిటల్ మీడియాను మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి ఐప్యాక్‌ను వాడుకొంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన సమయంలో చిన్న పిల్లలుగా ఉన్న వారు ఇప్పుడు ఓటర్లుగా మారారని, కొత్త తరం ఓటర్లను టీఆర్ఎస్ వైపు ఆకర్షించడానికి ఐప్యాక్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. కొత్త తరం ఓటర్లను చేరుకోవడానికి డిజిటల్ మీడియా ఎంతో కీలకమని చెప్పారు.