నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పక్కా లోకల్.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్ అని గుర్తు చేశారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాను. ఈ ప్రాంత ప్రజలకు సేవకుడిగా నిలుస్తాను. ఈ ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నాను. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. రాజగోపాల్ రెడ్డి రూ. 22 వేలకు అమ్ముడు పోయాడని ప్రజలే చెబుతున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిన రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తాను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మద్దతు తెలిపారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్‌ను గెలిపించుకుంటామని ప్రజలు తీర్మానాలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.