హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), ప్రజారోగ్య సంచాలకులను (డీపీహెచ్) ప్రభుత్వం మార్చింది. రమేశ్‌రెడ్డి స్థానంలో డాక్టర్ త్రివేణిని ఇన్చార్జి డీఎంఈగా నియమించింది. ఆమె ప్రస్తుతం ఉస్మానియా దవాఖానలో పనిచేస్తూ, అడిషినల్ డీఎంఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో అడిషనల్ డీఎంఈ కే శివరాంప్రసాద్‌ను ఇన్చార్జి డీఎంఈ (అకడమిక్)గా నియమించింది. ప్రస్తుతం ఆయన జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. వారిద్దరూ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీపీహెచ్ గడల శ్రీనివాసరావు స్థానంలో ప్రభుత్వం డాక్టర్ శివరాంనాయక్ను ఇన్చార్జి డీపీహెచ్గా నియమించింది. లెప్రసీ విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అధికారులు, వైద్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు.