#TriumphantTelangana, #ThankYouKCR హ్యాష్ ట్యాగ్‌లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృధ్దిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం పట్ల రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఏడున్నరేండ్లలోనే తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించి నేడు దేశానికే దిక్సూచిగా నిలబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆర్ధిక పురోభివృద్ధి విషయంలో అన్ని గణాంకాలను కోట్ చేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తూ పలువురు విదేశీ ప్రముఖులు సైతం కేటీఆర్ చేసిన ట్వీట్ రీ-ట్వీట్ చేస్తూ ప్రశంసించడం జరిగింది.
మరోవైపు కేటీఆర్ ట్వీట్‌ను సమర్థిస్తూ.. సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎన్నారైలు, తెలంగాణ యావత్ సమాజం కళ్లెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ.. వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గణాంకాలతో తమ ట్వీట్ల ద్వారా వివరించారు.
ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ అంటూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేండ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని, కేసీఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్ధిక వృద్ధి రేటు ఒక నిదర్శనమని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కేంద్రంలోని మోడీ సర్కార్ నుండి సహాయ నిరాకరణ ఎదురైనా.. సొంతంగా తన కాళ్ళ మీద తానూ నిలబడిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేడు జరుగుతన్న అభివృద్ధి భావి తెలంగాణకు గొప్ప భరోసా అని నెటిజన్లు పేర్కొన్నారు. మొత్తం మీద 50 వేలకు పైగా ట్వీట్లతో ట్విట్టర్లో #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్ హోరెత్తి దేశ ప్రజలను, జాతీయ మీడియాను ఆకర్షించింది.