కేసీఆర్ హయాంలోనే ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి అనుమతి లభించింది. దక్షిణభాగానికి సైతం గత ప్రభుత్వం లోనే ప్రణాళికలు జరిగాయి. ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయి. ఉత్తరభాగానికి టెండర్లు పిలవడం తమ గొప్ప అన్నట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
-బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్) ఆలోచన చేశామని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ రూపొందించామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను సహచర బీఆర్ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) తరహాలో సుమారు 300 కిలో మీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ట్రిపుల్ఆర్ నిర్మిస్తే వేల కోట్ల తెలంగాణ ప్రజల ధనం ఖర్చవుతుందని నాడు కేసీఆర్ భావించారని తెలిపారు.
తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు కాకుండా, కేంద్ర నిధులతో రోడ్డు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. నాగ్‌పూర్, భూపాలపట్నం, భద్రాచలం, విజయవాడ, బెంగళూరు, బెల్గాం, ముంబై, నాందేడ్, మెదక్-పిట్లం, రాజీవ్ రహదారి.. ఇలా మొత్తం పది ముఖ్యమైన రహదారుల నుంచి వాహనాలు నగరంలోకి రాకుండానే గమ్యస్థానాలకు వెళ్లేలా హైవేల అనుసంధానంతో ట్రిపుల్ఆర్ నిర్మించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు, హైవేస్ (మోర్త్) అధికారులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వారితో అనేకసార్లు అలైన్‌మెంట్‌పై నాటి సీఎం కేసీఆర్ చర్చించారని గుర్తుచేశారు. అనేక చర్చల అనంతరం ఉత్తర భాగానికి చెందిన ట్రిపుల్ఆర్ నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపారు.
దక్షిణభాగానికి సైతం కేసీఆర్ హయాంలోనే ప్రణాళికలు జరిగాయని, ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రతిపాదనలు ఆగాయని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించడం తగదని హితవుపలికారు. ఆ మాటలు అనే అర్హత కోమటిరెడ్డికి లేదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.
ముందున్న ప్రభుత్వాలు తలపెట్టిన పనులు కొనసాగించడం తదుపరి వచ్చే ప్రభుత్వ బాధ్యత అని, పంతాలకు పోకుండా నాటి ట్రిపుల్ఆర్ పనులను కొనసాగిస్తున్నందుకు సంతోషమని తెలిపారు. అదే సందర్భంలో ఉత్తరభాగం పనులకు టెండర్లు పిలువడంతోనే ఆపకుండా త్వరగా పూర్తిచేయడంతోపాటు దక్షిణభాగం పనులకు సంబంధించిన అనుమతులు కూడా తేవాలని డిమాండ్ చేశారు.