రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ రైతులు కదంతొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ భూములను బలవంతంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని ట్రిపుల్ఆర్ భూనిర్వాసితులు సోమవారం హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ దౌర్జన్య వైఖరిని నిరసిస్తూ వందలమంది రైతులు నినాదాలు చేశారు.
హైదరాబాద్ సిటీ బ్యూరో, అమీర్‌పేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ అన్నదాతలు కదంతొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ దండుకట్టారు. సీపీఎం పిలుపు మేరకు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని బాధిత రైతాంగం హైదరాబాద్ అమీర్‌పేట హెచ్ఎండీఏ కార్యాలయానికి సోమవారం వెల్లువలా తరలివచ్చారు. ప్రభుత్వ దౌర్జన్య వైఖరిని నిరసిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అనుకూల వర్గాల భూములను కాపాడేందుకే పాత అలైన్‌మెంట్‌ను సవరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా రైతులు మండిపడ్డారు. భూములను కోల్పోతున్న రైతులను సంప్రదించకుండా ఇష్టారీతిన అలైన్మెంట్ మార్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భూ సేకరణకు సంబంధించి రైతుల అనుమతి లేకుం డా దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా చేపట్టిన భూసేకరణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, పెద్దల భూములు కాపాడుతూ, పేదల భూములను మాత్రమే సేకరించేలా ప్రభుత్వ వ్యవహరిస్తున్నదని అన్నదాతలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
మార్కెట్ ధరకు అదనంగా నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూబులు కోల్పోయే వారిని బెదిరింపులకు గురిచేస్తూ తక్కువ ధర నిర్ణయించి భూములను సేకరించే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల న్యాయమైన డిమాండ్ల జాబితాను జాన్‌వెస్లీ హెచ్ఎండీఎ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ సంఘం కార్యదర్శి వెంకట్రాములు, సీపీఎం భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్, రంగారెడ్డి జిలా ్లకారద్యర్శి యాదయ్య, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు కోట రమేశ్, గిరిజన సంఘం కార్యదర్శి శ్రీరామ్‌నాయక్, సీనియర్ నాయకులు డీజీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసుల అరెస్టులు, నిర్బంధాలు షురూ అయ్యాయి. వందలాది మంది ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులతోపాటు సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు అక్కడే నిర్బంధించారు. ట్రిపుల్ ఆర్ బాధితులకు మద్దతుగా సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ముట్టడి కార్యక్రమానికి సీపీఎం పిలుపునిచ్చింది. ఈ జిల్లాల నుంచి భారీ గా తరలివెళ్తారనే సమాచారంతో పోలీసు లు ముందస్తు అరెస్టులకు దిగారు. బాధితులు వెళ్లకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ఉదయమే వారి ఇండ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి మండలం రాయగిరి, వలిగొండ మండలం గోకారం, వర్కట్‌పల్లి, చౌటుప్పల్, నారాయణపురం మండలాలు, నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, గట్టుప్పల్, చింతపల్లి మండలాలకు చెందిన భూనిర్వాసితులను హౌస్ అరెస్ట్ చేశారు. అయినా అనేక మంది రైతులు హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు బయలుదేరి వెళ్లారు. అక్రమ అరెస్టులను సబ్బండ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. పోలీసుల తీరుకు నిరసనగా పలు స్టేషన్లలో నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
మాకున్న రెండెకరాల భూమిని నమ్ముకొని బతుకుతున్నం. నేడు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో నా రెండెకరాలు భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంది. పెద్దోని భూములను కాపాడేందుకు మా భూములను మా అంగీకారం లేకుండా బలవంతంగా తీసుకుంటున్నది. ఈ భూమి నా చెయ్యి దాటిపోతే నలుగురు ఆడబిడ్డలను తీసుకుని నేనెక్కడికి పోవాలె. మా చెన్నంపల్లిలో ఫార్చూన్ బటర్‌ఫ్లై వెంచర్ భూములను కాపాడేందుకు రేవంత్ సర్కార్ అక్రమంగా భూములను లాక్కుంటుంది. కనీసం మార్కెట్ ధర గురించి కూడా ఆలోచించకుండా చేతిలో డబ్బులు పెట్టి, భూములను వదిలేయండన్నట్టు చేస్తున్నది. మా పానాలు పోయినా, మా భూములను వదిలేది లేదు.
– రాములమ్మ, చెన్నంపల్లి గ్రామం, ఆమన్‌గల్ మండలం
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు మా జీవితాలనే తలకిందు లు చేస్తున్నది. ఎకరం ధర మార్కెట్లో రూ.2 కోట్లకు పలుకుతున్నది. నా ఇద్దరు బిడ్డలను బాగా చదివిస్తే.. వారి జీవితాలు బాగుపడతయి అనుకున్న. ఇంతలో అలైన్మెంట్ మార్పు అని చెప్పి నాకున్న 6 ఎకరాల భూమి నుంచి 4 ఎకరాలను సర్కార్ గుంజుకుంటున్నది. ఈ రోడ్డు మా జీవితాల్లో నిప్పు లు పోస్తున్నది.
– సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, మందోల్లగూడెం, చౌటుప్పల్ మండలం
మూడు సర్వే నం బర్ల కింద నాకున్న 5 ఎకరాల భూమిని మొత్తం రీజనల్ రింగ్ రోడ్డే మింగేస్తుంది. ఇక నాకు మిగులుతున్నది 6 గుంటల స్థలం మాత్రమే. అది కూడా ఎందకూ పనికి రాకుండా మిగిలిపోతున్న స్థలం.కాంగ్రెస్ నేతల సొంత ప్రయోజనాలకు మా బతుకులను నాశనం చేస్తున్నరు. అప్పట్లో కెనాల్ కోసం 1.10 ఎకరాల భూమిని సర్కార్‌కు ఇచ్చిన.
– లింగంపల్లి నర్సింహులు, పీర్లపల్లి గ్రామం, జగ్దేవ్పూర్ మండలం