వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆధునికత పేరుతో సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధంగా సర్కార్ ప్రవర్తిస్తే ఊరుకునేదిలేదని ఆదివాసీలు హెచ్చరించారు. వచ్చే మేడారం మహాజాతరలో ఆదివాసీ కోయ గిరిజన తెగ ఇలవేల్పులు సమ్మక్క-సారలమ్మ కొలువైన గద్దెల ఆవరణ, ప్రాంగణానికి కొత్తరూపు తీసుకురావాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటే సహించేదిలేదని తెగేసి చెబుతున్నారు. ము లుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర నిర్వహిస్తున్నట్టు మేడారం వడ్డె (పూజారులు)లు నిర్ణయించారు.
మేడారం మహాజాతర నిర్వహణపై ఈ నెల 3న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సలహాదారు, ములుగు జిల్లా కలెక్టర్ తదితరులు మేడారం, కన్నెపల్లిని సందర్శించి, ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పనులపై ఆర్కిటెక్ట్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెల ఆవరణ, గద్దెల ప్రాంగణాన్ని వలయాకారంలో రాతిపీఠం, పైన శిలాస్తంభాలు, రాతితోరణాలతో కొత్తరూపు తీసుకురాబోతున్నట్టు ప్రదర్శించారు. ఈ డిజైన్‌పై ఆదివాసీల్లో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇలవేల్పు సమ్మక్క అని చెప్పే కోయబిడ్డ మంత్రి దనసరి అనసూయ.. రేవంత్ సర్కార్ జాతర పవిత్రను కాలరాస్తుంటే ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో జాతర నిర్వహణపై ఏ చిన్న అపశ్రుతి దొర్లినా తమ సంస్కృతీ, సంప్రదాయాలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆరోపించిన సీతక్క నేడు నోరెందుకు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఉంటే అట్ల..రేవంత్‌రెడ్డి ఉంటే ఇట్లనా?
ఆధునీకరణ పేరుతో మేడారం జాతరలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న మార్పులకు అడ్డుకట్ట వేయాల్సిన మంత్రి సీతక్క మౌనం దాల్చటం వెనుక ఆంతర్యం ఏమిటని ఆదివాసీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గద్దెల ప్రాంగణం ఆవల డప్పు కొట్టినట్టు ఫొటోకు ఫొజులిస్తే ‘సీఎం అలా చేయడం మా సంప్రదాయాలకు విరుద్ధం’ అని, 2012లో అదే గద్దెల ప్రాంగణంలో పోలీసు కళాజాత బృందాలు చేసిన కార్యక్రమాన్ని నిరసిస్తూ గద్దెల ప్రాంగణంలోనే బైఠాయించిన సీతక్క ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవటం దారుణమని మండిపడుతున్నారు.
మంత్రులు కొండా వర్సెస్ సీతక్క
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మేడారం జాతరను కూడా వదలటంలేదని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. మేడారం మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఉంది. గత జాతరలో మంత్రులిద్దరూ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించి, ఎవరికివారుగానే మేడారంను సందర్శించారు. జాతర కీలక ఘట్టంలో కొండా సురేఖ మేడారంలో లేకపోవడానికి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలే కారణమనే విమర్శలు వచ్చాయి. వాళ్ల ఆధిపత్యం కోసం తమ సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
గతానుభవాలను గుర్తుతెచ్చుకోండి :ఆదివాసీ సంఘాల ప్రతినిధులు
మేడారం జాతర పవిత్రతకు భంగం కలిగించేలా గతంలో జరిగిన ప్రయత్నాలను ఎలా అడ్డుకున్నామో ఇప్పుడూ అలాగే తిప్పికొడతామని ఆదివాసీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మంత్రులు, అధికారులు తమ హయాంలో జాతర నిర్వహణను ‘మార్పు’ చేశామని గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కలెక్టర్ కిషన్ మేడారం గద్దెల ప్రాంగణంలో ‘గోపురం’ నిర్మించేందుకు ప్రతిపాదించగా వారించారు. ఆకునూరి మురళి హయాంలో జాతరలో ‘కోళ్లు.. మేకలు కోయొద్దు’ అని ప్రయత్నిస్తే ‘జాతరకు మీరు వస్తే రండి లేకపోతే లేదు.
కొత్త విధానాలు పెట్టొద్దు’ అని తెగేసి చెప్పారు. త్రిపాఠి హయాంలో నిర్వహించిన ‘ఇలవేల్పుల సమ్మేళనం’పై జాతీయ స్థాయిలో కోయ తెగ అభ్యంతరం తెలిపింది. డీజే సౌండ్స్, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోయలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి వచ్చిన ‘తలపతులు’ (కోయ వడ్డెలు, తెగల పెద్దలు, పూజారులు) నిరసించారు. 2008లో గద్దెల ప్రాంగణంలో సాలహారాన్ని (వివిధ ఆలయాల్లో ఉండే విధంగా గోపురాలు, వాటిపై దేవతామూర్తుల రూపాలను) నిర్మించతలపెట్టినప్పుడు ఆదివాసీ సంఘాలు భారీ ఎత్తున ప్రతిఘటించాయి. 2006లో దేవాదాయశాఖ గద్దెల ప్రాంగణంలోని గోడపై పులిమీద సమ్మక్కను, జింక మీ ద సారలమ్మను పోలిన రూపాలతో పెయిం ట్స్ వేయిస్తే ఆదివాసీ సంఘాల ఆందోళనలతో వాటిని చెరిపేశారు’ అని గుర్తుచేశారు.
మేడారాన్ని గుంజేడులా మార్చే కుట్ర
సమ్మక్క-సారలమ్మను భవిష్యత్తులో మరో గుంజేడు ముసలమ్మ జాతరలా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. గుంజేడు ముసలమ్మ కోయ తెగ జరుపుకొనే జాతరలో ఒకటి. మొదట్లో అక్కడ విగ్రహం లేకుండె. బొడ్రాళ్ల బండలుండేవి. ఇప్పుడు విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. నిజానికి మా దైవాలకు రూపాలేమీ లేవు. ప్రకృతి మాకు దైవం. చెట్టు, పుట్ట, రాయిని కొలుస్తం. విగ్రహారాధన మా సంస్కృతిలో భాగమే కాదు. గుంజేడులో విగ్రహాన్ని పెట్టి కోయలకే శిక్షణ ఇచ్చి వాళ్లను పూజారులను చేసిండ్లు. సమ్మక్క-సారలమ్మ గద్దెలు, కైవారం చుట్టూ ఇప్పుడున్న పరిస్థితి మార్చాలని చూస్తున్నరు. ప్రభుత్వం ఈ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలె. లేకుంటే తీవ్రంగా ఉద్యమిస్తాం.
– చందా మహేశ్, బయ్యక్కపేట, కోయ గిరిజన రీసెర్చ్ స్కాలర్