నార్నూర్, మార్చి 18 : భగ్గుమంటున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలు, గూడేల వాసులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో 270 కుటుంబాలు ఉండగా.. 1500 వరకు జనాభా ఉంది.
కొలాంగూడలో ఒక చేతిపంపు, గోండుగూడలోని అటవీ ప్రాంతంలో ఒక చేతిపంపు ఉండగా.. వీటి ద్వారా బొట్టుబొట్టు నీళ్లు వస్తున్నాయి. రెండు చేతిపంపుల వద్ద రాత్రీపగలు తేడా లేకుండా నీటికోసం నిరీక్షించాల్సి వస్తున్నదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో సమస్యను విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.