దహెగాం, జూన్ 8 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగం మండలంలోని ఖర్జీ గ్రామ పంచాయతీ పరిధిలోని లోహ గిరిజన గ్రామం మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నది. ట్రాన్స్ఫార్మర్ పాడైపోగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అడవిబిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. బోర్లు పని చేయక నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కిలో మీటర్ దూరంలోని పెద్దవాగుకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అసలే దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రాత్రిళ్లు భయంభయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి జంతువులు దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.