హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తమ సాగు భూములను గుంజుకొని.. తన భర్తను జైలుకు పంపి.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా దాష్టీకానికి దిగిన వేళ అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తన సోదరుడిగా భావించి లగచర్ల జ్యోతి రాఖీ కట్టింది. కొడంగల్ మండలం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు కలిసి హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి శుక్రవారం వచ్చి ఆయనకు రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. నాటి లగచర్ల భూ పోరాట ఘటనలు..కేటీఆర్ అండగా నిలిచిన తీరును గుర్తుచేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రభుత్వం మా భూములు గుంజుకొని, నా భర్తను, కుటుంబసభ్యులను జైల్లోపెట్టి.. పోలీసులతో దాడులు చేయించి దౌర్జన్యానికి దిగిన సందర్భంలో నిండు గర్భిణి అయిన నా బాగోగులను కేటీఆర్ ఓ సోదరుడిలా చూసుకున్నారు. నా ఆరోగ్యంతో పాటు నా బిడ్డ యోగాక్షేమాలు చూసుకున్నారు. మేనమామలా నా బిడ్డకు భూమినాయక్ అని నామకరణం చేశారు’ అని గుర్తుచేసుకుంటూ జ్యోతి కన్నీటిపర్వంమైంది. సోదర సమానుడైన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పింది.
లగచర్ల సినతల్లి గుర్తుందా? భూములు ఇవ్వనందుకు తన భర్తను జైలుకు పంపి, తమపై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సర్కారుపై ఢిల్లీ దాకా వెళ్లి పోరాడింది లగచర్ల జ్యోతి. ఆ సమయంలో ఒక అన్నలా తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తమ తండా మహిళలతో కలిసి వచ్చి శుక్రవారం రాఖీ కట్టింది జ్యోతి.
ప్రభుత్వం మా భూములు గుంజుకొని.. నా భర్తను, కుటుంబసభ్యులను జైల్లో పెట్టి.. పోలీసులతో దాడులు చేయించి దౌర్జన్యానికి దిగిన సందర్భంలో నిండు గర్భిణి అయిన నా బాగోగులను ఓ సోదరుడిలా కేటీఆర్ చూసుకున్నారు. నా బిడ్డకు భూమినాయక్ అని నామకరణం చేశారు. అందుకే రామన్న కోసం లగచర్ల నుంచి ఈ రాఖీ తెచ్చిన. – లగచర్ల జ్యోతి