ఖమ్మం రూరల్, జూలై 28 : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూసుమంచి మండలం బోడియాతండా పరిధిలోని నామాతండాకు చెందిన భూక్యా ప్రతిమ (14) పదోతరగతి చదువుతున్నది. సోమవారం ఆమె ఎఫ్ఏ-1కు సంబంధించి సోషల్ పరీక్ష రాస్తూ కండ్లు తిరిగి కింద పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
ప్రతిమ మృతికి స్పష్టమైన కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తూ రాత్రి ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రధాన వైద్యశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడే ప్రధాన రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రతిమ అనారోగ్యానికి గురైతే సాయంత్రం వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతో ఖమ్మం టూటౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తమ కూతురి మరణానికి కారణాలు తెలిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిమ తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని వేడుకున్నారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వైద్యశాలకు వచ్చారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రతిమ తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ కాళ్లపై పడి తమగోడు వెళ్లబోసుకున్నారు. చదువు కోసమని గురుకులంలో చేర్పిస్తే అకస్మాత్తుగా మృతి చెందిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం జరిగేలా చూస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు.