హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో ఆదివాసీల హక్కులు ప్రమాదంలో పడ్డాయని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవించే హక్కును ఎన్కౌంటర్ల ద్వారా కేంద్రం కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో హత్యాకాండ కొనసాగిస్తున్నారు. సుమారు 650 భద్రతా దళాల క్యాంపులతో దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తూ ఆదివాసీలను అమానుషంగా హత్య చేస్తున్నారు. ఏడాది కాలంలో దాదాపు 400 మంది చనిపోయారు. అసలు ఎన్కౌంటర్ కొనసాగుతుండగానే మృతుల సంఖ్య బయటికి వస్తున్నది. ఇది ఎలా సాధ్యం? ముందుగానే ఆదివాసీలను క్యాంపుల్లో నిర్బంధించి.. చంపాలనుకున్నప్పుడు మావోయిస్టుల దుస్తులు వేసి అడవిలోకి తీసుకెళ్లి చంపడం అనవాయితీగా వస్తున్నది. ఇంకెన్నాళ్లు ఈ బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగిస్తారు?’ అని నారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పౌర హక్కుల నేత, అమరుడు అజాం అలీ వర్ధంతిని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.