సైదాబాద్, జూలై 3 : సింగరేణి కాలనీలో ఓ కుటుంబానికి సంబంధించిన అప్పు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన గిరిజన నాయకురాలిని పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి గుడిసెల్లో నివసించే మైఖేల్, శివలాల్ మధ్య నెలకొన్న అప్పు చెల్లింపు వివాదంపై సీపీఐ నగర మహిళా నాయకురాలు, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సక్రిబాయి గురువారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బాధితుల తరఫున ఆమె మాట్లాడుతుండగా సెక్టార్ ఎస్సై సాయికృష్ణ కలగజేసుకున్నారు. ఫోన్ లాక్కొని, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ, పీఎస్లోనే మధ్యా హ్నం వరకు కూర్చోబెట్టారు.
బాధితుల తరఫున మాట్లాడేందుకు వస్తే తననే నిర్బంధిస్తారా అంటూ ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సేవాలాల్ బంజారా నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజన మహిళలు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎస్ఐ సాయికృష్ణను సస్పెండ్ చేయాలంటూ నినదించారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ గిరిజన సంఘాల నాయకులతో మాట్లాడి, ఘటనపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గిరిజన నాయకులు ధర్నా విరమించారు. ఎస్సైని సస్పెండ్ చేసేదాకా పోరాటం చేస్తామని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ తెలిపారు.