మంచిర్యాల, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు త్వరలో హక్కులు కల్పిస్తామని దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసే విధంగా జీవో 3ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించిన కుమ్రంభీం వర్ధంతి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భీం విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రూ.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాకే గిరిజనుల బతుకులు బాగుపడ్డాయన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ట్యాంక్‌బండ్‌పై కుమ్రంభీం విగ్రహం నెలకొల్పడంతోపాటు బంజారాహిల్స్ లో రూ.55 కోట్లతో ఆదివాసీ భవన్ నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ యేడు కూడా గిరిజన దండారీ ఉత్సవాలకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. గుస్సాడీ, పెర్సపేన్ 100 దేవాలయాలకు (ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షల చొప్పున) నిధులు ఇవ్వడానికి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కలెక్టర్లు రాహుల్‌రాజ్, సిక్త్తా పట్నాయక్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.