పాపన్నపేట, జూలై 3 : మూడు రోజులుగా రెండు గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మెదక్ జిల్లా మొదలకుంట, నర్సింగరావుపల్లి గిరిజన తండాల రైతులు బుధవారం పాపన్నపేట మండలం రామతీర్థం సబ్స్ట్టేషన్ను ముట్టడించారు. సబ్‌స్టేషన్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏఈ నిర్లక్ష్యం కారణంగా నర్సింగరావుపల్లి, మొదలకుంట తండాలకు విద్యుత్తు సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనేగల రామతీర్థం, మల్లంపేట గ్రామాలకు త్రీఫేజ్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.