హైదరాబాద్/వికారాబాద్/వరంగల్ జిల్లా నెట్వర్క్, నవంబర్ 12: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి నిరసనగా ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉద్యోగుల నిరసనలు కొనసాగాయి. నల్లబ్యాడ్జీలు ధరించిన రెవెన్యూ ఉద్యోగులు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి అధ్యర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు విధులను బహిషరించారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ అధ్యర్యంలో డీజీపీని ట్రెసా ప్రతినిధులు కలిశారు. ఈమేరకు నిందితులను తప్పకుండా శిక్షిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని, ట్రెసా అండగా ఉంటుందని రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ భరోసా ఇచ్చారు.
ఈ నిరసనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే చంద్రమోహన్ మద్దతు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల కలెక్టరేట్లలో ఉద్యోగులు, సిబ్బంది, జిల్లాల పరిధిలోని మండలాల రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో ట్రెసా ఉపాధ్యక్షుడు కే నిరంజన్‌రావ్, నేతలు మనోహర చక్రవర్తి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పీ రాజ్‌కుమార్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ట్రెసా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి విజేందర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.