హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో బీపీ పేషెంట్లకు (BP Patients) బీఆర్ఎస్ (BRS) హయాంలో (2018-24 మధ్య కాలంలో) నాణ్యమైన సేవలందినట్టు తాజాగా ‘ది ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI)’ అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళలోని రెండేసి జిల్లాలతోపాటు మహారాష్ట్రలో ఒక జిల్లాలో ఈ అధ్యయనం నిర్వహించినట్టు తెలిపింది. బేస్లైన్, ఫాలోఅప్ పేరిట రెండు దశల్లో ఈ అధ్యయనం జరిపామని, బేస్లైన్ 2018-19 సర్వేలో బీపీ ఉండి చికిత్స తీసుకుంటున్న 2,873 మందిపై, ఫాలోఅప్ సర్వే 2023-24లో 3,276 మందిపై విశ్లేషణ చేశామని వివరించింది. బేస్లైన్ సర్వే సమయంలో 20% మంది సర్కారు దవాఖానాల్లో చికిత్స తీసుకున్నారని, ఫాలోఅప్ సర్వే నాటికి ఆ సంఖ్య 32 శాతానికి, బీపీ అదుపులో ఉన్నవారి సంఖ్య 37 నుంచి 48 శాతానికి పెరిగిందని వెల్లడించింది. 2018-24 మధ్య కాలంలో ప్రభుత్వ దవాఖానాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పినవారి సంఖ్య 72 నుంచి 81 శాతానికి పెరిగిందని, అదే సమయంలో మందుల కోసం డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పినవారి సంఖ్య 47 నుంచి 9 శాతానికి తగ్గిందని తెలిపింది.
బీపీ ఉన్న వారిలో 2018-19 నాటికి కేవలం 14.4% మంది ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించారని, 2023-24 నాటికి ఈ సంఖ్య 26.2 శాతానికి చేరిందని పేర్కొన్నది. బీఆర్ఎస్ హయాంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు, పీహెచ్సీలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొంది బీపీని అదుపులో ఉంచుకున్నవారి సంఖ్య 40 43 శాతానికి పెరిగిందని తెలిపింది. 2018-24 మధ్య కాలంలో బీపీ పేషెంట్లకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటమే ఈ ఫలితాలకు కారణమని స్పష్టం చేసింది. సర్కారు దవాఖానాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని 2018-19లో 63% మంది, 2023-24లో 91% మంది చెప్పినట్టు వెల్లడించింది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సర్కారు వైద్యానికి కొత్త ఊపిరి ఊదారు. ఉమ్మడి రాష్ట్రంలో సరైన వైద్యసేవల్లేక కునారిల్లిన తెలంగాణను స్వరాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణగా మార్చారు. పలు వినూత్న పథకాలతో వైద్యారోగ్య రంగాన్ని సంస్కరించారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించిన కేసీఆర్.. 2023-24 నాటికి ఆ మొత్తాన్ని రూ.12,364 కోట్లకు చేర్చారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చూడటం, అత్యాధునిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాడు బస్తీ, పల్లె దవాఖానాలు, పీహెచ్సీలు, ఏరియా దవాఖానాలు సమర్థంగా పనిచేయడంతో సత్ఫలితాలు వచ్చాయి. అందుకు ఐహెచ్సీఐ అధ్యయన నివేదికే స్పష్టమైన నిదర్శనం. ఈ నివేదిక కేసీఆర్ పాలనలో ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు పెరిగిన నమ్మకాన్ని సూచిస్తున్నది.