హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రెసా మాజీ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి గత నెల 31న ఉద్యోగ విరమణ పొందిన క్రమంలో మూసారాంబాగ్ రెవెన్యూ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు.
ఏడేండ్లుగా ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న గౌతమ్ కుమార్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన రమణ్రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వంగ రవీందర్‌రెడ్డిని ట్రెసా గౌరవ అధ్యక్షుడిగా కార్యవర్గం నియమించింది. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్, రమణ్‌రెడ్డి తమ ఎన్నికకు సహకరించిన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేట్ అధ్యక్షులు రాజ్‌కుమార్, రియాజుద్దీన్, కోశాధికారి వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు నిరంజన్‌రావు, సీఎల్బీ శాస్త్రి, చక్రవర్తి, ప్రభాకర్, ఎల్లారెడ్డి, అంజిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్వహిస్తున్న న్యాయవాదుల ఎన్రోల్మెంట్ ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. ఎన్రోల్మెంట్ దరఖాస్తులకు ఆదివారం, సోమవారం మాత్రమే అవకాశం ఇవ్వడం, అదీ సాయంత్రం 5 గంటల నుంచి కేవలం 200 మందికి మాత్రమే పరిమితి విధించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దిష్ట సమయానికి వేలాది మంది అభ్యర్థులు ఒకేసారి పోర్టల్‌ను ఆశ్రయించడంతో సర్వర్లు మొరాయించి తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఫలితంగా సర్వర్ వేగంగా స్పందించిన వారికే దరఖాస్తు పూర్తవుతుండగా, సాంకేతిక లోపాల వల్ల వందలాది మంది అభ్యర్థులు ఎన్రోల్మెంట్ అవకాశం కోసం ఎదురుచూసున్నారు. ఈ విచిత్రమైన నిబంధనలపై న్యాయవాద వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. ఇంటర్నెట్ స్పీడ్, సర్వర్ రెస్పాన్స్‌ను పరీక్షించే విధంగా ఎన్రోల్మెంట్ ప్రక్రియ సాగుతున్నదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం 200 మందికే పరిమితి పెట్టి, వారంలో రెండంటే రెండు రోజులకే ప్రక్రియను కుదించడం ఏరకంగా న్యాయమని నిలదీస్తున్నారు.