చెన్నై: కెప్టెన్ ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్) అజేయ శతకంతో కదం తొక్కడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ తొలి రోజే భారీ స్కోరు సాధించి పట్టు బిగించింది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ పేలవ బౌలింగ్‌ను ఆసరాగా చేసుకున్న ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. శిఖర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ (72), కుమార్ కుశాగ్ర (63 బ్యాటింగ్), వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) కూడా రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు అభిమన్యు, సూర్యవంశీ తొలి వికెట్‌కు 14 ఓవర్లలోనే వంద పరుగులు జోడించి అద్భుత ఆరంభం అందించారు. ఉన్నంతసేపు మంచి షాట్లతో ఆకట్టుకున్న యంగ్ సెన్సేషన్ తన ఆట చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. మరోవైపు సౌత్ బౌలర్లలో హైదరాబాదీ సీవీ మిలింద్ (2/56) ఒక్కడే రెండు వికెట్లతో రాణించగా మిగతా వాళ్లు నిరాశపరిచాడు. మరో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (0/96) భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. కాగా, ఈస్ట్ జోన్‌కు ఆడుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, సౌత్ జోన్ బౌలర్ శ్రేయస్ గోపాల్ ఈ పోరుతో 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నారు.
తొలి సెషన్లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ మధ్య నడిచిన ఆన్-ఫీల్డ్ డ్రామా తీవ్ర ఆసక్తి రేపింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో విరుచుకుపడ్డ సూర్యవంశీ దృష్టి మళ్లించేందుకు తిలక్ స్లెడ్జింగ్, మైండ్‌గేమ్ ప్రారంభించాడు. క్రీజులో ఉన్న సూర్యవంశీని ఉద్దేశించి ‘క్యా యార్ యే వైస్ కెప్టెన్’ (ఏంటయ్య ఈ వైస్ కెప్టెన్) అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. కొద్దిసేపటికే సూర్యవంశీ..మిలింద్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు.