ఎదులాపురం, సెప్టెంబర్ 6 : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్స్టేషన్ పరిధిలోని రాంనగర్ కాలనీలో ఉన్న ఎస్సీ స్టడీ సరిల్ సెంటర్లో విషాద ఘటన చోటు చేసుకొన్నది. ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్న దుర్గం స్వామిరాం(26) ఆదివారం మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం నాగంపేట్కు చెందిన స్వామిరాం డిగ్రీ పూర్తి చేసి, ఎస్సీ స్టడీ సరిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఐదు నెలల ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారు. మరో నెల రోజులు శిక్షణ మిగిలి ఉంది.
ఆదివారం ఉదయం తోటి అభ్యర్థులతో కలిసి టిఫిన్ చేసేందుకు స్వామిరాం వెళ్లాడు. అనంతరం స్టడీ సరిల్ భవనంలోని పైఅంతస్తుకు వెళ్లాడు. కొద్ది సేపటికే భవనం నుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తోటి అభ్యర్థులు రిమ్స్ దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్ తెలిపారు.