తెలంగాణ సమాజంలో పొలాల అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రైతుల జీవితంలో ముడిపడిన ఈ పండుగను కాడెద్దుల పండుగ, బసవన్న పండుగ, ఎడ్ల పండుగ, పొలాల పండుగ అని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. శ్రావణ మాసంలో ప్రతీరోజూ ప్రత్యేకమే. ఈ మాసంలో భక్తులు నిష్ఠతో ఉండటమే కాకుండా ప్రకృతితో మమేకమయ్యే పండుగలు జరుపుకొంటారు. శ్రావణమాసం అమావాస్య రోజున ఆ సంవత్సరం మొత్తం అన్నదాతలకు అండగా నిలిచిన ఎద్దులను పూజించే వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.
తరతరాలుగా రైతులకు వ్యవసాయపనుల్లో అన్ని కాలాల్లో అండగా నిలుస్తున్న ఎద్దుల రుణాన్ని తీర్చుకోవడానికి రైతులు ఏడాదికి ఒకసారి జరుపుకొనే ముఖ్యమైన పండుగ ఈ పొలాల అమావాస్య. తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ఈ వేడుకను అంతే వైభవంగా చేస్తారు. రైతు తనతో పాటు వ్యవసాయపనుల్లో కష్టపడిన ఎడ్లకు కృతజ్ఞత చెప్పే విధానమే ఇది. రైతన్నలతో పాటు ఇంటి మహిళలు కూడా పొలాల అమావాస్య రోజు తమ సంతానం కోసం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. సంతానం ఉన్నవారు వారి యోగక్షేమాల కోసం, పెండ్లయి సంతానం లేనివారు పొలాల అమావాస్య రోజున సంతానం కోసం శివపార్వతులకు పూజలు చేస్తారు.
ఎడ్లకు ఒకరోజు ముందే బరువులు దింపే కార్యక్రమం చేస్తారు. ఏడాది పొడవునా కష్టపడే బసవన్నకు పొలాల అమావాస్య ముందురోజు సెలవు ఇవ్వడమేకాకుండా ఆరోజు ఎలాంటి బరువులు వేయకుండా చూసుకుంటారు. దుక్కుల నుంచి పంట చేతికి వచ్చే వరకు, పంటను అమ్మేందుకు మార్కెట్కు తీసుకెళ్లేవరకు అడుగడుగునా రైతన్న బరువు బాధ్యతలు మోసే బసవన్నకు ఒకరోజు సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్దలు పెట్టుకున్న ఆచారమే ఈ పొలాల అమావాస్య. రైతన్న తన కాడెద్దులను అమావాస్య తెల్లవారుజామున తమ గ్రామాల్లోని వాగులు, చెరువుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయిస్తారు. ఎడ్లను అందంగా ముస్తాబు చేసి, కొమ్ములకు రంగులు వేసి, రంగురంగుల దుస్తులతో, కుంకుమ బొట్లతో అలంకరించి , అందంగా తీర్చిదిద్ది ముస్తాబు చేస్తారు. ఇలా అలంకరించిన ఎడ్లను గ్రామంలో ఉన్న ఆలయాలకు తీసుకెళ్లి అక్కడ హారతులు ఇచ్చి నందీశ్వరుడుగా, బసవేశ్వరుడుగా పూజిస్తారు.
ఆదివాసీ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగను మరింత ఘనంగా చేసుకుంటారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈ పండుగను పురన్పోలీగా జరుపుకోవడం కనిపిస్తుంది. ఎద్దులను అలంకరించి పూజలు చేయడం ఒక ఎత్తయితే, ఎద్దులకు గోమాతలతో పెండ్లి చేస్తారు కూడా! ఆ తర్వాత ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయిస్తారు. గ్రామపెద్దలు ఎద్దులను తెచ్చిన రైతులకు కండువా కప్పి సత్కరిస్తారు. ఈ సంబురాన్ని చూసేందుకు ఊరుఊరంతా ఆలయాల వద్దకు తరలివస్తారు. ఇదే సందర్భంలో చేసే ప్రత్యేక పిండి వంటకం పురన్పోలీ. తెలుగునాట వీటిని బూరెలు అంటాం. పండుగ రోజు ఎద్దుల జతను శివుడి నందిగా భావించి నైవేద్యంగా బూరెలు పెడతారు. కాలం మారి పొలాలు దున్నడానికి ఇతర వ్యవసాయ పనులకు యంత్రాలు వచ్చినప్పటికీ ఈ పండుగ ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ పొలాల అమావాస్య రోజున ఎద్దులను పూజించే సంప్రదాయం కొనసాగుతున్నదంటే ఇది ఒక ఆచారం కాదు. రైతు, భూమి, ప్రకృతి, పశువుల మధ్య ఉన్న అనుబంధానికి కాడెద్దుల పండుగ ప్రతీక.
రంగనాథ్ మిద్దెల, 9866573461