హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రాంతం, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌కు ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. వార్దా, వైన్‌గంగ నదుల సంగమ ప్రాంతంలో తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ స్థలాన్ని ఖరారు చేసే ముందు సాంకేతిక అధ్యయనాల్లో సానుకూల ఫలితాలు వచ్చిన తర్వాతే బరార్ నిర్మాణ స్థలాన్ని ఖరారు చేయాలని కోరారు. వార్దా, వైన్ గంగ నదుల పరీవాహక ప్రాంతాలు, వర్షపాత పద్ధతులు, హైడ్రోగ్రాఫ్లు భిన్నంగా ఉండటంతో వాటి వేగం, ప్రవాహ సమయాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయని.. దీనివల్ల బరాజ్ వద్ద అస్థిరమైన ప్రవాహం ఏర్పడి, పెద్ద సుడిగుండాలు, అడ్డ ప్రవాహాలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని వివరించారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా బరాజ్‌కు సంబంధించి విభిన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బోరెపల్లి సైట్ (ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టికి 9 కిలోమీటర్ల దిగువన) గురించి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం ఆర్వీ అసోసియేట్స్‌కు సిఫార్సు చేసినట్టు పేర్కొన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), డీపీఆర్ నిబంధనల ప్రకారం.. ప్రస్తుత ప్రతిపాదిత స్థలంతోపాటు అన్ని ప్రత్యామ్నాయాలపై నమునా అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. మహారాష్ట్రలో ముంపు తక్కువ ఉండేలా, సాంకేతిక, ఆర్థికపరంగా ఉత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసేలా ప్రభుత్వానికి సూచించాలని టీఆర్ఈఏ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ తన్నీరు వెంకటేశం, గౌరవ అధ్యక్షుడు జీ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.