హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద బరాజ్ కడితే గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చేవి. కరెంటు భారం ఉండకపోయేది’ ఇదీ కాంగ్రెస్ పాలకులు, కొందరు కుహనా మేధావులు చెప్తున్న మాట! తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, కొడంగల్, పరిగి, తాండూర్ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తాం’ అని సెలవిచ్చారు. ఈ మాటలన్నీ వట్టి అబద్ధాలేనని నీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే మధ్యలో రెండు చోట్ల ఎత్తిపోతలు తప్పనిసరి అని, ఇక తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాంకేతికంగా అసాధ్యమని ఇంజినీర్లు తేల్చిచెప్తున్నారు. దాదాపు 6.4 కి.మీ పొడవుతో బరాజ్ కట్టాల్సి ఉండటం ఒకెత్తయితే.. భౌగోళికంగా, సాంకేతికంగా అనేక సవాళ్లు ఎదురవుతాయని, చాత్రాల్ అభయారణ్యం అనుమతులు కూడా పెద్ద అడ్డంకిగా మారుతాయని, ఇందుకు ప్రస్తుత ఎస్ఎల్బీసీయే సజీవసాక్ష్యమని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టును రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటన్నింటినీ దాచిపెట్టి కాంగ్రెస్ పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నది.
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్లు ఉంటుంది. నీళ్ల తరలింపు పనులను మొత్తంగా 5 ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ 3 అనేది పూర్తిగా బరాజ్ నిర్మాణం. ఇక ప్యాకేజీ 1 అంటే 0-15 కి.మీ. కాలువ, ప్యాకేజీ 2లో 15-28.5 కి.మీ. కాలువ, ప్యాకేజీ 4లో 28.5 నుంచి 71.5 కి.మీటర్లు మైలారం వరకు కాంక్రీట్ లైనింగ్ లేని కాలువ తవ్వకం పనులు. ఇక అత్యంత కీలకమైంది ప్యాకేజీ 5 పనులు. ఇందులో మొత్తంలో 44.50 కి.మీ. నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా 74వ కి.మీ. పాయింట్ వద్ద ఒక పంప్‌హౌస్ ఏర్పాటు చేయాలి. 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 పంపులతో నీటిని 29 మీటర్లు ఎత్తిపోయాలి. అక్కడి నుంచి 2 కి.మీ. వరకు 3.60 డయా ఎంఎస్పీ పైపుల ద్వారా నీటిని 10 మీ. డయా కలిగిన 9 కి.మీ. పొడవైన 2 టన్నెళ్లలోకి తరలిస్తారు.
మళ్లీ 92వ కి.మీ. పాయింట్ వద్ద పంపింగ్ స్టేషన్-2ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లను మళ్లీ 19 మీటర్లు ఎత్తిపోయాలి. 92వ కి.మీ. నుంచి 101వ కి.మీ. వరకు గ్రావిటీ ద్వారా జలాలు తరలిస్తారు. 101వ కి.మీ. పాయింట్ వద్ద రాళ్లవాగుపై బరాజ్ నిర్మించి నీళ్లను తరలిస్తారు. రాళ్ల వాగు నుంచి నీళ్లు ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు చేరుతాయి. ఇదీ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటి సరఫరా తీరు. మొత్తంగా రెండు లిఫ్ట్‌ల ద్వారా దాదాపు 48 మీటర్ల మేరకు జలాలను ఎత్తిపోయాలి. అప్పుడుగాని ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు ప్రాణహిత జలాలు చేరుకోవు. అయినా గ్రావిటీ ద్వారా వస్తాయంటూ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.
రీడిజైన్ చేయడం వల్ల అదనంగా పెరిగింది ఒక పంపింగ్ స్టేషన్ మాత్రమే తప్ప ఏమీ లేదు. ఇదిలా ఉంటే ప్యాకేజీ 5 పనులకు మొత్తంగా రూ.3,626 కోట్లకు అంచనా వేయగా, ఆపై ఆ మొత్తాన్ని రూ.5,356 కోట్లకు సవరించారు. బరాజ్ నిర్మాణం చేపట్టకుండానే ప్యాకేజీ 5లో పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి పైపులను, ఎలక్ట్రిక్ మెకానికల్ సామగ్రిని కొనుగోలు చేశారు. దాదాపు 891 కోట్లను కాంగ్రెస్ ఖర్చు చేసింది. 71 కి.మీ. మట్టి కాలువలు తవ్వి జేబులు నింపుకొన్నారు. లిఫ్ట్‌లు ఉన్నాయనే విషయాన్నే దాచి కాంగ్రెస్ మాత్రం గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవంటూ ప్రజలను మభ్యపెడుతున్నది. ఇప్పటికీ అదే అబద్ధాలు చెప్తున్నది.
బరాజ్ నిర్మాణం, లిఫ్ట్‌ల విషయం పక్కనపెడితే తవ్విన కాలువలు సైతం తెలంగాణ అవసరాల మేరకు నీటిని తరలించలేని పరిస్థితే ఉంటుంది. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌పై మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కానీ ఏకపక్షంగా 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి అనుగుణంగా కాలువలను డిజైన్ చేసింది. 145.45 మీటర్ల వద్ద సిల్ లెవల్ మినిమం డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్)ను ఖరారు చేసింది. దాదాపు 6.55 మీటర్ల వాటర్ హెడ్ ఉంటుంది. ఆ మేరకు నీటి తరలింపు కాలువలను 75 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో తవ్వాలని డిజైన్ చేసింది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు వరకు ప్యాకేజీ 1, 2, 4కు సంబంధించి మొత్తంగా 71 కి.మీ. పొడవుతో అన్లైన్డ్ కెనాల్ తవ్వకాన్ని పూర్తి చేశారు.
ప్రస్తుతం బరాజ్ ఎత్తు 148 మీటర్లకు కుదించడం వల్ల ఆ మేరకు 2.55 మీటర్ల మేరకు వాటర్ హెడ్ తగ్గిపోతుంది. నీటి సరఫరా వేగం కూడా పూర్తిగా తగ్గుతుంది. డైవర్షన్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ హెడ్‌తో 150 రోజుల పాటు నిరాటంకంగా నీటిని మళ్లించుకున్నా గరిష్ఠంగా 66 టీఎంసీలు, కనిష్ఠంగా 44 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి. పీసీఎస్ఎస్ ప్రాజెక్టు ఆయకట్టుకే ఇంకా దాదాపు 100 టీఎంసీల లోటు ఏర్పడుతుంది. దీంతో కాలువ ద్వారా నీటిని మళ్లించడం సవాళ్లతో కూడుకున్నదేనని ఇంజినీర్లు చెప్తున్నారు. నీటిని తరలించాలంటే కాలువలో అదనంగా అనేకంగా క్రాస్ రెగ్యులేటర్లను నిర్మించాల్సి ఉంటుందని తెలుస్తున్నది. ఈ కారణాల రీత్యా ప్రాజెక్టును చేపట్టడం అసాధ్యమని నాడే కాదు ఇప్పటికీ ఇంజినీర్లు కుండబద్ధలు కొట్టి మరీ స్పష్టంచేస్తున్నారు. అదీగాక 71 కి.మీ మైలారం దాటిన తర్వాత కాలువ అలైన్మెంట్ భూములను కోల్ ఫీల్డ్ కోసం సింగరేణి ఇప్పటికే డిమార్కేషన్ చేసింది. ఇప్పుడు ఈ అంశాన్ని తేల్చాల్సి ఉన్నది.
బరాజ్ నిర్మాణ ప్రాంతంలో చత్రాల్ అభయారణ్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు సాధించడం కష్టతరమే. అందుకు ఎస్‌ఎల్‌బీసీనే ఇప్పటికీ నిదర్శనంగా నిలుస్తున్నది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ ప్రాంతం కూడా అభయారణ్యంలోనే ఉన్నది. అయితే 1983లో ఎస్ఎల్బీసీ తెరమీదకు రాగా, సుదీర్ఘ కాలం తర్వాత 1994లో కేంద్రం నుంచి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చాయి. కానీ కేంద్రం అక్కడ అనేక కఠిన షరతులు విధించింది. అభయారణ్యంలోకి అడుగుకూడా పెట్టవద్దని తేల్చిచెప్పింది. కేవలం భూమి కింద నుంచి సొరంగం తవ్వుకోవాలని షరతు పెట్టింది.
వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, బెదిరిపోకుండా ఉండాలంటే భూమి ప్రకంపనలు రాకుండా చూసుకోవాలి. ఆ మేరకు భూ ఉపరితలం నుంచి చాలా లోతు నుంచి సొరంగాన్ని తవ్వాలి. అఖరుకు సొరంగం తవ్వడానికి ముందు అధ్యయనం చేయడానికి హెలికాఫ్టర్ వినియోగిస్తే దాని శబ్దం 50 డెసిబుల్స్ దాటకూడదని నిబంధనలు విధించింది. అంటే వాక్యూమ్ క్లీనర్ ఎంత శబ్దం వస్తుందో అంతకు మించి రాకూడదు. హెలీకాప్టర్ తక్కువ ఎత్తులో ఎగరకూడదు. జియలాజికల్ సర్వేకు అభయారణ్యంలో బోర్ హోల్స్‌కు అనుమతి లేదు. ఇలాంటి అనేక షరతులతో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలోనే దాదాపుగా రెండు దశాబ్దాలుగా సొరంగం పనులు కొనసాగుతూనే ఉండగా, ఇప్పుడు ఏకంగా మూలకుపడ్డాయి. ఇదిలా ఉంటే తమ్మిడిహట్టి వద్ద కూడా బరాజ్ నిర్మాణానికి ఇలాంటి అవాంతరాలే ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. కనీసం పర్యావరణ అనుమతుల కోసం నాటి కాంగ్రెస్ కేంద్ర అటవీ పర్యావరణశాఖను కూడా సంప్రదించ లేదు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బరాజ్‌ను వదిలిపెట్టి కాలువల పనులు చేపట్టింది.
ఉమ్మడి ఏపీ సర్కారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి (పీసీఎస్ఎస్) ప్రాజెక్టును 2007లో ప్రతిపాదించింది. వార్ధా, వేన్గంగా నదులు కలిసిన తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకు తొలుత రూ.609 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా, తర్వాత రూ.1742 కోట్లకు పెంచింది. పీసీఎస్ఎస్ ప్యాకేజీ 3 కింద బరాజ్ పనులను ఓ ఏజెన్సీకి అప్పగించింది.
కానీ బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను రాష్ట్ర ఏర్పాటు నాటికీ నిర్ణయించకపోవడంతో పనులే మొదలు కాలేదు. ప్రతిపాదిత ప్రదేశం వద్ద బరాజ్ నిర్మాణానికి సాంకేతిక అంశాలు సానుకూలంగా లేవని అధికారులు ఆదిలోనే అభ్యంతరం వ్యక్తంచేశారు. బరాజ్ నిర్మించాలంటే నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో ఉండాల్సి ఉండగా, తమ్మిడిహట్టి వద్ద పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నదని గుర్తించారు. అది కూడా కేవలం 45 డిగ్రీల స్క్యూ షేప్‌లో బరాజ్ నిర్మించాల్సి ఉంటుందని, అది క్షేమదాయకం కాదని, అదీగాక ఇప్పటివరకు ఆ స్క్యూ షేప్‌లో బరాజ్ నిర్మాణానికి డిజైన్లు ఎక్కడా లేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు.
మొత్తంగా తమ్మిడిహట్టి వద్ద కుడి, ఎడమ మట్టికట్టలను కలుపుకొని సుమారు 6.4 కిలోమీటర్ల బరాజ్ నిర్మించాల్సి ఉంటుంది. అందులో 3.7 కి.మీ పొడవు మేర బరాజ్‌ను కాంక్రీట్ నిర్మాణంతో చేపట్టాల్సి ఉంటుంది. అదీగాక 100 నుంచి 110 గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా. మొత్తం బరాజ్ నిర్మాణం ఒకెత్తయితే నిర్వహణ ఇంకా భారమని ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తంచేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 12.20 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు 2007లో రూ.17,875 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత అదనంగా నల్లగొండలో 67500 ఎకరాలను, ఉమ్మడి రంగారెడ్డిలో 1.50 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి స్టేజ్-2, 3 కలిపి 1.24 లక్షల ఎకరాలను కలిపారు. మొత్తంగా ప్రాజెక్టు ఆయకట్టు ప్రతిపాదిత ఆయకట్టు కంటే అదనంగా 34 శాతం పెరగగా, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 115 శాతం పెంచారు. రూ.17,875 కోట్ల నుంచి రూ.38,500 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2010లో సీడబ్ల్యూసీకి సమర్పించారు.
కానీ అంతకంటే ముందే 2008 మే నుంచి 2009 మే మధ్యలోనే ప్రాజెక్టు పనులను ఏజెన్సీలకు అప్పగించారు. 4 ఏండ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనలతో పనులు కట్టబెట్టి ఆ తర్వాత 8 ఏండ్లకు రీషెడ్యూల్ చేశారు. అయినా పనులు పూర్తిచేయలేదు. ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి సర్వే కాంపోనెంట్స్ కోసం పనుల చెల్లింపు బిల్లుల్లో తొలుత 0.43 నుంచి 0.50 శాతం మేరకు ఇవ్వాలని నిర్ణయించారు.
కానీ తర్వాత ఆ మొత్తాన్ని ఏకంగా 2 నుంచి 3.50 శాతానికి సవరించారు. వాస్తవంగా ప్రాజెక్టు వ్యయంలో సర్వే కాంపోనెంట్ల కోసం మొత్తంగా రూ.172.12కోట్లు చెల్లించాల్సి ఉండ గా, దాన్ని అసాధారణంగా రూ.1211.23కోట్లకు పెంచారు. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పెట్టిన కుంపట్లు అన్నీఇన్నీ కావు.