Transfers | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 ( నమస్తే తెలంగాణ ): రవాణా శాఖలో బదిలీలు గందరగోళంగా జరిగాయని అధికారులు గుర్రుగా ఉన్నారు. సికింద్రాబాద్ కార్యాలయంలో లెక్కకు మించి ఐదుగురు ఎంవీఐలను కేటాయించగా, ఆర్టీఓను మాత్రం కేటాయించలేదు. అవసరమున్న మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో ఎంవీఐలు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
అక్కడ మరో ముగ్గురి అవసరం ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరో కార్యాలయం బండ్లగూడలో ఇప్పటికీ ఆర్టీఓను కేటాయించలేదు. ఇంకో కార్యాలయం ఉప్పల్లో నలుగురు ఉండాల్సిన ఎంవీఐలకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. బదిలీలకు ముందు సమగ్ర ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా ఓ కార్యాలయానికి అవసరమున్న సిబ్బంది దృష్ట్యా బదిలీలు జరగాల్సి ఉంటుది.
కానీ, అలాకాకుండా కేవలం కొంతమంది అధికారులపై కక్షపూరితంగా బదిలీలు చేశారంటూ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు ఫిబ్రవరిలో జరిగిన ఆర్టీఏ అధికారుల బదిలీలు సైతం అనేక విమర్శలకు తావిచ్చాయి. రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం గతానికి విరుద్ధంగా బదిలీలు చేసింది. మధ్యరాత్రి అధికారులకు వ్యక్తిగతంగా వాట్సాప్, మెయిల్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
తెల్లారేసరికి మీరు మరో కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సంబంధిత అధికారులకు ఉత్వర్వులు జారీ చేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియతో అధికారులు కొంత అసహనానికి గురయ్యారు. కాగా, గ్రేటర్లో మొత్తం 10 ఆర్టీఓ కార్యాలయాలుండగా, రెండు(కూకట్పల్లి, కొండాపూర్)యూనిట్ ఆఫీసులు ఉన్నాయి. వీటిలో నిత్యం వందకు పైగా స్లాట్స్ బుక్ అవుతుంటాయి.