హనుమకొండ, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాహనదారులను రవాణా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అవసరాల కోసం వాహనాలను అమ్ముకునే వారిని, వాహనాల మొదటి టర్మ్ ముగిసి రెన్యువల్ కోసం వెళ్లే వారిని తిప్పించుకుంటున్నారు. వాహనదారులు రోజుల తరబడి తిరిగినా ఈ ప్రక్రియను పూర్తి చేయడంలేదు. జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి అడిగితే హైదరాబాద్ కార్యాలయంలోనే సమస్య ఉన్నదని, తాము ఏమీ చేయలేమని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 2 వేల ద్విచక్ర వాహనాలతోపాటు 500 కార్లు, ఇతర వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. రెన్యువల్, పాత వాహనాల అమ్మకం అనంతరం పేరు మార్పిడి కోసం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 500 మంది వరకు ఆర్టీఏ ఆఫీసులకు వస్తుంటారు. రవాణా శాఖ చార్జీలను పెంచినప్పటి నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇన్వాయిస్ సేవల విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి.
వాహన రిజిస్ట్రేషన్ సమయంలో వాహన ధరను ఆన్లైన్లో నమోదు చేస్తారు. చార్జీలు పెంచిన అనంతరం లక్షల వాహనాల ధరలు రవాణా శాఖ వెబ్సైట్లో కనిపించడం లేదు. దీంతో స్లాట్ బుకింగ్ కావడం లేదు. 15 ఏండ్లు ముగిసిన వాహనాలు రీ రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వస్తే వాహనాల సమాచారం అందుబాటలో ఉండటం లేదు. దీంతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసే సమయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. వాహనాన్ని బదిలీ చేసే క్రమంలోనూ ఇన్వాయిస్ రావడం లేదు. దీంతో స్లాట్ బుక్ కావడం లేదు. దీంతో వాహనదారులు రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సీసీ కోసం ఇతర జిల్లాల నుంచి వస్తున్న వాహనదారులు పని కాకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. రోజూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.