హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షలను ఆదివారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించామని పరీక్షల కన్వీనర్, జేఎన్టీయూ డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తెలిపారు. పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 98,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 77,907 మంది అభ్యర్తులు హాజరయ్యారన్నారు. 20,975 మంది అభ్యర్థులకు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు.
విధివిధానాల మేరకు ప్రశ్నాపపత్రం సెట్‌ను సింగరేణి ఉన్నతాధికారులు, జేఎన్టీయూ వైస్ చాన్సెలర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించామని చెప్పారు. పరీక్షలు ముగిసిన అనంతరం ఓఎంఆర్ షీట్లను బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించామన్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగిందని చెప్పిన ఆయన.. మోసగాళ్ల మాయమాటలను విశ్వసించొద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించారు. పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న ప్రభుత్వ ఏజెన్సీ జేఎన్టీయూ హెచ్ ద్వారా పరీక్షలను నిర్వహించామన్నారు.
నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు.. సింగరేణి విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా వ్యవహరించిందన్నారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసగించే వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. వారి వివరాలు గోప్యంగా ఉంచి.. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు సంబంధించి కీని సోమవారం ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు. కీ పై ఏవైనా అభ్యంతరాలుంటే 48 గంటల్లోగా తెలియజేస్తే పరిశీలిస్తామని విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.